కంటి నుంచి 23 కాంటాక్ట్ లెన్సుల తొలగింపు

కంటి నుంచి 23 కాంటాక్ట్ లెన్సుల తొలగింపు

కాంటాక్ట్ లెన్స్ వల్ల ఎంత లాభం ఉంటుందో.. ఒక్కోసారి దాన్ని సరైన పద్ధతిలో వాడకపోతే అంతే మొత్తంలో నష్టాలూ ఉంటాయి. ఈ వ్యాఖ్యలు నిజమని నిరూపిస్తూ.. కాలిఫోర్నియాలో ఓ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కంటి సమస్యతో డాక్టర్ వద్దకు వచ్చిన ఓ మహిళ కంట్లో నుంచి 23 కాంటాక్ట్ లెన్సులను తీశారు. రోజూ కాంటాక్ట్ లెన్సులు పెట్టుకునే ఆ మహిళ.. నిద్ర పోయేటపుడు అవి తీయకుండానే నిద్ర పోయేదట. మరుసటి రోజు ఆ పాత లెన్సును తీసివేయకుండానే మరో కొత్త లెన్స్ ను ధరించేదట.

అలా ఒక్కరోజు కాదు, రెండ్రోజులు కాదు రోజూ అదే పద్దతిని ఫాలో అయిన ఆ మహిళ.. కాంటాక్ట్ లెన్స్ లను తీయాలనే ఆలోచనను మరిచిపోయిందట. అయితే ఓ రోజు కంట్లో నొప్పిగా ఉందని డాక్టర్ ను సంప్రదించగా.. పరీక్షించిన డాక్టర్ ఆమె కంట్లో 23 లెన్స్ లు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ప్రత్యేకమైన పరికరంతో వాటిని విజయవంతంగా తొలగించాడు. లెన్స్ లు ఒకదానికి మరొకటి అతుక్కుని రెప్పల కింద నుంచి తీసివేసే ప్రక్రియను వీడియో తీసిన ఆ డాక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో లెన్సులు ఆకుపచ్చ,తెలుపు రంగులో ఉండడాన్ని చూడవచ్చు. తన దగ్గరికి వచ్చిన ఓ పేషెంట్ కంటి నుంచి కాంటాక్ట్ లెన్సులను సక్సెస్ ఫుల్ గా రిమూవ్ చేశానని, కాంటాక్ట్ లెన్స్‌లను పెట్టుకొని నిద్రపోకండని ఆ డాక్టర్ సూచనలిచ్చారు.