పల్లె ప్రగతికి కార్మికుల కొరత

పల్లె ప్రగతికి కార్మికుల కొరత
  • కొత్త పంచాయతీలలో కార్మికులను నియమించలే
  • 2018 లో కొత్తగా 4,380 జీపీల ఏర్పాటు
  • 17 వేల మంది కార్మికులు అవసరమంటున్న అధికారులు
  • ప్రతి 500 జనాభాకు ఒక కార్మికుడు ఉండాలన్న సీఎం
  • ఒక్కో ఊరికి 8 మంది అవసరమంటున్న సంఘాలు

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీలలో కార్మికుల కొరత వేధిస్తోంది. జనాభాకు అనుగుణంగా కార్మికులు లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న కార్మికులపై తీవ్రమైన పనిభారం పడుతున్నది. శుక్రవారం నుంచి ఈనెల 18 వ వరకు పల్లె ప్రగతి నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. 15 రోజుల పాటు డ్రైనేజీల క్లీనింగ్, చెత్త తొలగింపు, మొక్కలు నాటడం, పాత బావులు పూడ్చటం, పాత ఇండ్లు, శిథిలావస్థకు చేరుకున్న కరెంట్ స్తంభాలను తొలగించటం ఇలా ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. గ్రామాల్లో కార్మికులు తక్కువ ఉన్నందున ఇవన్ని పనులు ఎట్లా చేయాలని కార్మికులు ప్రశ్నిస్తున్నరు.  రాష్ట్రంలో 12769 గ్రామ పంచాయతీలు ఉండగా సుమారు 43 వేల మంది కార్మికులు పనిచేస్తున్నరు. ప్రతి 500 మంది జనాభాకు ఒక కార్మికుడు ఉండాలని సీఎం కేసీఆర్ పలు సార్లు అన్నారు. అయితే ఈ హామీ 
కార్యరూపం దాల్చలేదు.

కొత్త పంచాయతీల్లో కార్మికులేరి
2018లో రాష్ట్రంలో 500 జనాభా దాటిని తండాలు, హామ్లెట్ పల్లెలు మొత్తం 4380 కొత్త గ్రామ పంచాయతీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే వీటికి  కార్మికులను మాత్రం నియమించలేదు. కొత్త జీపీలకు సుమారు 17 వేల మంది కార్మికులు అవసరమని పంచాయతీ రాజ్ కమీషనర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే 4 ఏండ్లు అయినా ఇంత వరకు కార్మికులను నియమించలేదు. దీంతో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. గ్రామాల్లో కొత్త పనులు అమలు చేస్తుండటంతో ప్రతి ఊరికి ఎనిమిది మంది కార్మికులు అవసరమని కార్మిక సంఘాల నేతలు అంటున్నరు. జీతం కూడా రూ.8500 ఇస్తున్నారని ఈ మొత్తంతో కార్మికులు ఎట్ల బతకాలని వాపోతున్నరు. దీనిని రూ.15 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఎన్నో సార్లు ఆందోళనలు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని చెబుతున్నారు.

మూడు నెలలుగా జీతాల్లేవ్​
2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ పంచాయతీల్లో కార్మికులు ఉన్నరు. ఈ 11 ఏళ్లలో జనాభా, కాలనీలు, వాడలు ఎంతో పెరిగినయి. పల్లె ప్రగతిలో 15 రోజులు ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. పని ఒత్తిడి పెరిగింది. కానీ కార్మికులు పెరగలేదు. కొత్త జీపీల్లో, అదనపు కార్మికులు అవసరం ఉన్న దగ్గర సెక్రటరీలు నియమిస్తున్నరు. వీరికి రూ.8500 జీతం ఇస్తుంటే సెక్రటరీలు కొంత కట్ చేసి రూ.6 వేలు, రూ.4 వేలు ఇస్తున్నరు. మూడు నెలల నుంచి జీతాలు కూడా ఇస్తలేరు.
- వెంకటయ్య, కార్మికుడు, 
పత్తిపాక, నెక్కొండ, మహబూబాబాద్ జిల్లా

కొత్త జీపీలకు కార్మికులను నియమించాలే 
ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ప్రతి 500 మంది జనాభాకు ఒక కార్మికుడిని నియమించాలని మా యూనియన్​ తరపున కోరుతున్నం. కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి నాలుగేండ్లు అవుతున్నా ఇంత వరకు కార్మికులను నియమించకపోవటం బాధాకరం. దీని వల్ల ఉన్న కార్మికులపై ఒత్తిడి పెరుగుతోంది. ఒక్కో జీపీకి 8 మంది కార్మికులు అవసరం. జీతం కూడా రూ.15 వేల కు పెంచాలని కోరుతున్నం. 8,500 జీతంతో ఇపుడున్న ఖర్చులకు ఎలా బతుకుతం.
- పాలడగు భాస్కర్, అధ్యక్షుడు, గ్రామ పంచాయతీ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్