
వానాకాలం సీజన్ మొదలైనప్పటి నుంచి కరీంనగర్ జిల్లాలో యూరియా ఎరువుల కొరత తీవ్రంగా పెరిగింది. పంటల పెరుగుదలకు అవసరమైన యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సైదాపూర్ మండలంలోని వెంకేపల్లి విశాల సహకార సంఘం గోదాం వద్ద శుక్రవారం (ఆగస్టు8) రైతులు భారీగా చేరుకున్నారు.యూరియా సరఫరా వచ్చిన సమాచారం తెలుసుకున్న వెంటనే మండలంలోని పలు గ్రామాల రైతులు సెంటర్ వద్దకు తరలివచ్చారు.
చెప్పులతో క్యూ
వందలాదిగా తరలివచ్చిన రైతులు యూరియా కోసం క్యూల్లో నిలబడకుండా, చెప్పులను క్రమంగా పెట్టి తమ స్థానాన్ని గుర్తించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గోదాం వద్ద హడావిడి కొనసాగింది.
రైతుల డిమాండ్
వానాకాలం ప్రారంభమై నెలలు గడుస్తున్నప్పటికీ, యూరియా సరఫరా లోపం కారణంగా పంటలకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని, అవసరమైన యూరియా అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వ్యవసాయానికి యూరియా ప్రాధాన్యం
యూరియా పంటలలో నైట్రోజన్ లోపాన్ని భర్తీ చేస్తుంది. ఇది లేకపోతే పంటలు పసుపు రంగు పడుతూ దిగుబడి తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సకాలంలో సరఫరా జరగకపోతే రైతులకు ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది.