దిశ ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌ పోలీసులపై కేసు పెట్టాలి : వింద్రా గ్రోవర్‌

దిశ ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌  పోలీసులపై కేసు పెట్టాలి : వింద్రా గ్రోవర్‌

హైదరాబాద్, వెలుగు : దిశ నిందితులను ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌ చేసిన పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని సీనియర్‌‌‌‌  అడ్వొకేట్ వింద్రా గ్రోవర్‌‌‌‌ హైకోర్టుకు విజ్ఞప్తికి చేశారు. బాధితులకు తక్షణ న్యాయం అందించాలన్న పేరుతో పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. కోర్టులు చెప్పాల్సిన తీర్పులను పోలీసులు అమలు చేశారని, తక్షణ న్యాయం పేరుతో పోలీసులు ఆ విధంగా చేసే హక్కు రాజ్యాంగంలో లేదన్నారు. ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో చనిపోయిన వాళ్ల డెడ్‌‌‌‌బాడీలను మార్చురీకి పంపకుండానే ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నమోదు చేయకుండా పోలీస్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ మీడియాకు విషయాలు చెప్పారని, అలా చేయడం సుప్రీంకోర్టు గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌కు వ్యతిరేకమన్నారు. పోలీసులు చేసిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌ను సీపీ సమర్థించడాన్ని తీవ్రంగా పరిగణించాలని హైకోర్టును గ్రోవర్ కోరారు.  

2019 డిసెంబర్​ 6న షాద్‌‌‌‌నగర్‌‌‌‌ సమీపంలో దిశ అనే మహిళను అత్యాచారం చేసి హత్య చేశారనే కేసులో నలుగురు నిందితులను పోలీసులు  ఎన్‌‌‌‌ కౌంటర్‌‌‌‌  చేసిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేయాలంటూ దాఖలైన పిల్, ఇతర రిట్లపై సోమవారం చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌ భూయాన్, జస్టిస్‌‌‌‌ ఎన్‌‌‌‌.తుకారాంజీలతో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ విచారణ ప్రారంభించింది. పిటిషనర్ల తరపు సీనియర్‌‌‌‌  అడ్వొకేట్ వింద్రా గ్రోవర్‌‌‌‌ వాదనలు వినిపించారు. పోలీస్‌‌‌‌ కస్టడీలో ఉన్న నిందితుల ప్రాణాలకే రక్షణ లేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ‘‘ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌కు ముందు నిందితులు తుపాకులను ఎలా అన్‌‌‌‌లాక్‌‌‌‌ చేశారు?  ఒకవేళ పోలీసులే అన్‌‌‌‌లాక్‌‌‌‌ చేసుంటే అలా ఎందుకు చేశారో చెప్పడం లేదు. నిందితులపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నప్పుడు వారి చేతులకు సంకెళ్లు ఎందుకు వేయలేదు? ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ పెట్టకుండానే ఆఖరికి డెడ్‌‌‌‌బాడీలు మార్చురీకి పంకుండానే పోలీస్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ మీడియాతో ఎలా మాట్లాడతారు? ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌ను సీపీ ఎలా సమర్థిస్తారు? ఎన్నో అనుమానాలు ఉన్నాయి’’ అని వింద్రా గ్రోవర్‌‌‌‌  పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్‌‌‌‌ సిర్పూర్కర్‌‌‌‌ ఆధ్వర్యంలోని కమిషన్‌‌‌‌ సిఫారసుల ఆధారంగా పోలీసులపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. దిశ ఎన్‌‌‌‌ కౌంటర్‌‌‌‌ పై సిట్‌‌‌‌ దర్యాప్తు కూడా లోపభూయిష్టంగా ఉందన్నారు. సీసీటీవీ ఫుటేజీలను సేకరించలేదన్నారు. పోలీసుల వాదనల నిమిత్తం విచారణను బెంచ్ ఈనెల 23కి వాయిదా వేసింది.