వరద బాధితులకు వెంటనే సాయం అందించాలి

వరద బాధితులకు వెంటనే సాయం అందించాలి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పడుతున్న వానలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాళ్లకు వెంటనే సాయం అందించాలని సీఎం కేసీఆర్​ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శనివారం లేఖలో కోరారు. ముందే వాతావరణ విభాగం హెచ్చరించినా సర్కారు స్పందించకపోవడంతోనే నష్టం వాటిల్లిందని, పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వరద బాధితులకు భరోసా కల్పించాల్సిన సీఎం కేసీఆర్.. ఒక్క రోజు పర్యటనతో సరిపెట్టి ఫాంహౌస్​లో సేదతీరుడేందని ప్రశ్నించారు.

కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో సర్వం కోల్పోయి ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారని, భగీరథ నీళ్లు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాలో 15 వేల ఎకరాల్లో పంట మునిగిందని, ఇల్లు మునిగిపోయిందని ఓ మహిళ సూసైడ్ చేసుకుందని పేర్కొన్నారు. మంథనిలో 1,500 కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వేల ఎకరాల్లో పంటలు కోల్పోయారని తెలిపారు. వరద బాధితులకు తక్షణ సాయం అందజేయాలని సూచించారు.