శ్రద్దా వాకర్ ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పూనావాలాను ఉరి తీయాలని ఆమె తండ్రి వికాస్ వాకర్ డిమాండ్ చేశారు. శ్రద్దా వాకర్ ను హత్య తరువాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన ఆయన..ముంబైలోని వసాయ్ పోలీసులు గతంలోనే తనకు సహకరించి ఉంటే ఇప్పుడు తమ కూతురు శ్రద్దా వాకర్ బతికి ఉండేదన్నారు. ఈ కేసు దర్యాప్తులో ఢిల్లీ పోలీసులు సరిగా విచారణ చేస్తున్నారన్నారు. తమకు న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారని వికాస్ తెలిపారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తమకు ఇదే హామీ ఇచ్చారని చెప్పారు. ఈ కేసులో అఫ్తాబ్ కుటుంబ సభ్యులు, బంధువులను విచారించాలని వికాస్ వాకర్ డిమాండ్ చేశారు.
డేటింగ్ యాప్‌ల పై అంక్షలు పెట్టాలన్న వికాస్ వాకర్.. 18 ఏళ్లు దాటిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. డేటింగ్ యాప్‌ల ద్వారానే శ్రద్ధకు ఆఫ్తాబ్‌తో పరిచయం ఏర్పడిందని తెలిపారు. తన కూతురికి జరిగింది మరెవరికీ కూడా జరగకూడదన్నారు. తాను చివరగా 2021లో తన కూతురితో మాట్లాడినట్టుగా వెల్లడించారు. సెప్టెంబర్ 26న అఫ్తాబ్‌తో మాట్లాడానని.. అప్పుడు తన కూతురి గురించి అడిగితే ఏమీ చెప్పలేదన్నారు.
ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఉన్న ఫ్లాటులో అఫ్తాబ్ మే 18న శ్రద్ధాను చంపేశాడు. ఆ మరుసటి రోజు పది గంటల పాటు ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. 35 ముక్కలను 18 ప్యాకుల్లో అమర్చి.. ఒక్కో ప్యాక్‌ను ఒక్కోరోజు చొప్పున 18 రోజుల పాటు రాత్రి 2 గంటల సమయంలో మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో పడేశాడు. శ్రద్ధా తండ్రి నవంబర్ 11న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని సాకేత్ కోర్టు శుక్రవారం మరో 14 రోజులు పొడిగించింది. అతన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు.
