- డీఆర్డీవో ‘బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్’ పరీక్షలు విజయవంతం
- ఖండాంతర క్షిపణులను కూల్చే సత్తా గల అతికొద్ది దేశాల సరసన భారత్
న్యూఢిల్లీ: శత్రు దేశాలు ప్రయోగించే బాలిస్టిక్, న్యూక్లియర్ మిసైళ్లను అడ్డుకుని, కూల్చేసే ‘బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్(బీఎండీ)’ వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించింది. మీడియం, లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులతోపాటు న్యూక్లియర్ మిసైళ్లను సైతం గాలిలోనే అడ్డుకునే బీఎండీని డీఆర్‌డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) సైంటిస్టులు బుధ, గురువారాల్లో వరుసగా మూడుసార్లు పరీక్షించినట్టు రక్షణ శాఖ శనివారం ప్రకటించింది.
బహుళ అంచెల రక్షణ కవచంలా పనిచేసే బీఎండీ భూ వాతావరణం లోపల(ఎండో-అట్మాస్ఫియరిక్), వాతావరణం వెలుపల (ఎక్సో-అట్మాస్ఫియరిక్) కూడా శత్రు బాలిస్టిక్ క్షిపణులను పేల్చేసే సత్తాను చాటిందని వెల్లడించింది. శత్రువులు ప్రయోగించే అవాక్స్ (ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్) నిఘా విమానాలతోపాటు యుద్ధవిమానాలను సైతం ఈ వ్యవస్థ గాల్లోనే అడ్డుకోగలదని తెలిపింది. ‘‘ఇంటర్‌సెప్టర్ (శత్రు క్షిపణులను అడ్డుకునే) క్షిపణులు తమ లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి.
కొత్తగా ఎదురవుతున్న క్షిపణి ముప్పులను తిప్పికొట్టేలా సరికొత్త సాంకేతికతలతో ఈ వ్యవస్థలను డీఆర్డీవో సైంటిస్టులు అభివృద్ధి చేశారు’’ అని రక్షణ శాఖ వివరించింది. ‘‘ఎండో-అట్మాస్పియరిక్ క్షిపణులు 100 కిలోమీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉండే భూ వాతావరణ పరిధిలో పనిచేస్తాయి. ఎక్సో-అట్మాస్పియరిక్ క్షిపణులు భూ వాతావరణం అత్యంత ఎగువన ఉండే ప్రాంతంలో తమ లక్ష్యాలను పూర్తి చేయగలవు. ఈ పరీక్షలు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను సైతం ఎదుర్కొనే బీఎండీ సామర్థ్యం కలిగిన అగ్రదేశాల సరసన మన దేశాన్ని నిలబెట్టాయి’’ అని పేర్కొంది.
