
- నెల పాటు ప్రత్యేక పూజలు, భక్తుల ఉపవాస దీక్షలు
- శ్రావణంలోనే మంగళగౌరి, వరలక్ష్మి వ్రతాలు
- వచ్చే నెల 9న రాఖీ పౌర్ణమి, 16న శ్రీకృష్ణజన్మాష్టమికి ఘనంగా ఏర్పాట్లు
వేములవాడ, వెలుగు: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో శుక్రవారం నుంచి శ్రావణ మాసం వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ నెల రోజుల పాటు మహిళలు మంగళగౌరి, వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. శివుడికి శ్రావణం ఇష్టమైన నెల కావడంతో భక్తులు ఉపవాస దీక్షలతో స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుందని, కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం.
శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు
ఈ శ్రావణ మాసంలో 4 సోమవారాలు, 5 శుక్రవారాలు రానుండగా ఈ రోజుల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సోమవారాల్లో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం మహాలింగార్చన నిర్వహిస్తారు. శుక్రవారాల్లో రాజరాజేశ్వరీ దేవికి ఉదయం, చతుష్టోపచారాలతో పూజలు, మహలక్ష్మీ అమ్మవారికి షోడషోపచార పూజలు నిర్వహించనున్నారు. అనుబంధ ఆలయం మహాలక్ష్మీ ఆలయంలో అమ్మవారికి మహిళలు ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లిస్తుంటారు. ఆగష్టు 9న రాఖీ పౌర్ణమి, 16న గోకులాష్టమి సందర్భంగా రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, అద్దాల మండపంలో డోలోత్సవం, ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆగస్టు14న రేవతి నక్షత్రం సందర్భంగా అనంత పద్మనాభస్వామివారికి పంచోననిషధార అభిషేకం, పూర్ణహుతి, రుద్రయాగం, మహాలింగార్చన కార్యక్రమంతో శ్రావణ మాసం ఉత్సవాలు ముగుస్తాయి.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్శనాలు
శ్రావణ మాసంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆది, సోమ, శుక్రవారాల్లో గర్భగుడి దర్శనాలు బంద్ చేసి లఘు దర్శనం అమలు చేస్తున్నాం. షిఫ్ట్‌ల ప్రకారం ఉద్యోగులను అదనంగా కేటాయిస్తున్నాం. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్జిత సేవల వేళల్లో మార్పులు ఉంటాయి. అనారోగ్యం, పాలుమరువని కోడెలను, జెర్సీ కోడెలను భక్తులు మొక్కుబడి కోసం తీసుకురావద్దు.
ఈవో రాధాబాయి, రాజన్న ఆలయం