ప్రారంభం కానున్న శ్రావణమాసం వేడుకలు

ప్రారంభం కానున్న శ్రావణమాసం వేడుకలు
  • ఈశాన్యంలో మండపాన్ని రెడీ చేసిన సిబ్బంది
  • ఇప్పటికే 1,400 టికెట్ల బుకింగ్​

యాదగిరిగుట్ట, వెలుగు: శ్రావణమాసం నేపథ్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కోటి కుంకుమార్చన నిర్వహించడానికి ఆలయ ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానాలయం ఉత్తర, తూర్పు రాజగోపురాల మధ్య ఈశాన్యంలో కుంకుమార్చన పూజలు నిర్వహించడానికి ప్రత్యేక మండపాన్ని రెడీ చేశారు. మరోవైపు కోటి కుంకుమార్చనలో పాల్గొనడానికి వీలుగా టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 27 వరకు కోటి కుంకుమార్చన ఆర్జిత సేవ భక్తులకు అందుబాటులో ఉండనుంది. కోటి కుంకుమార్చన టికెట్ ధర రూ. 2 వేలుగా నిర్ణయించారు. ఒక టికెట్ పై దంపతులకు మాత్రమే పూజలో పాల్గొనడానికి ప్రవేశం ఉంటుంది. ఒకసారి టికెట్ కొన్న దంపతుల కుటుంబసభ్యుల గోత్రనామాలపై 30 రోజుల పాటు రుత్వికులతో ప్రత్యేక సంకల్పం చేయిస్తారు. ఇప్పటికే 1,400 మంది దంపతులు కోటి కుంకుమార్చన టికెట్లను బుక్ చేసుకున్నారని ఆలయ ఈఓ గీతారెడ్డి చెప్పారు. శ్రావణమాసం ముగిసే వరకు భక్తుల గోత్రనామాలపై సంకల్పం చేస్తారన్నారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు మహాలక్ష్మి, ఆండాళ్ అమ్మవార్లకు కోటి కుంకుమార్చన నిర్వహిస్తారు. కోటి కుంకుమార్చన నిర్వహణ కోసం ఆలయ అర్చకులతో పాటు మరో 30 మంది రుత్వికులను ప్రత్యేకంగా రప్పించారు. 

రాజన్న క్షేత్రంలో ...

వేములవాడ: వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి శ్రావణమాసం వేడుకలు ప్రారంభం కానున్నాయి. నెల రోజులపాటు రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసంలో నాలుగు సోమవారాలు, ఐదు శుక్రవారాలు వస్తున్నాయి. ఆ రోజుల్లో స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం మహా లింగార్చన నిర్వహిస్తారు. శుక్రవారాలు రాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి ఉదయం, సాయంత్రం చతుష్టోపచారములతో పూజలు, సాయంత్రం మహాలక్ష్మి అమ్మవారికి షోడషోపచార పూజలు చేస్తారు. 12న రాఖీ పౌర్ణమి, యజుర్వేద ఉపాకర్మ, 19న గోకులాష్టమి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అద్దాల మండపంలో డోలోత్సవం, సాయంత్రం ఉట్టి కొట్టే నిర్వహించనున్నారు. భక్తులకు  అవసరమైన ఏర్పాట్లు చేశామని, త్వరగా స్వామి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఈఓ రమాదేవి చెప్పారు.