ముఖమంతా గాయాలైనా మిస్​ వరల్డ్ పోటీలో విన్నర్​

ముఖమంతా గాయాలైనా మిస్​ వరల్డ్ పోటీలో విన్నర్​

పన్నెండేళ్ల వయసులో జరిగిన కారు యాక్సిడెంట్ ఆమె ముఖాన్ని మార్చేసింది. దానికి తోడు ఆగిపోతుంది అనుకున్న గుండెకి పేస్​మేకర్​ పెట్టారు డాక్టర్లు. ఇన్ని సమస్యలు ఉన్నా జీవితం ముగిసిపోయింది అనుకోలేదు తను. అందాల పోటీల్లో పార్టిసిపేట్​ చేసింది. ‘మిస్​ వరల్డ్ అమెరికా –2021’ పోటీలో విన్నర్​గా నిలిచింది. ఈ పోటీల్లో గెలిచిన మొదటి ఇండియన్ అమెరికన్​గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీ సైనీ.  అమెరికాలోని వాషింగ్టన్​ డిసిలో ఉండే సైనీకి చిన్నప్పటి నుంచి అందాల పోటీల్లో పార్టిసిపేట్​ చేయాలనే కల ఉండేది.  కారు ప్రమాదంలో ముఖమంతా గాయాలయ్యాయి. అయినా కూడా   ఆమెలో  కాన్ఫిడెన్స్ ఇసుమంతైనా తగ్గలేదు. ఆ కాన్ఫిడెన్స్​తోనే అందాల పోటీల్లో గెలుస్తూ వచ్చింది. తాజాగా లాస్ ​ఏంజెలెస్​​లో ‘మిస్​వరల్డ్​ అమెరికా’ కిరీటాన్ని అందుకుంది సైనీ.    కరోనా టైమ్​లో  ‘బ్యూటీ విత్​ పర్పస్’ క్యాంపెయిన్​కి  నేషనల్​ అంబాసిడర్​గా ఉన్న సైనీ  కొవిడ్​ రిలీఫ్​ ​ ఫండ్​కి వేల డాలర్లు​ కలెక్ట్​ చేసింది. ఆపదలో ఉన్నవాళ్లకి, పేదవాళ్లకి సాయం చేయడంలో ముందుండే సైనీని అంతా ‘బ్యూటీ విత్​ పర్పస్​’ అని మెచ్చుకుంటున్నారు.  
 అమ్మానాన్న ప్రోత్సాహంతో...
‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఫీలింగ్స్ మాటల్లో చెప్పలేకపోతున్నా. ఈ క్రెడిట్​ అంతా మా అమ్మానాన్నదే. నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు  థ్యాంక్స్​.  నాకు గుండె వాల్వ్​లో బ్లాక్​ ఉంది. పేస్​మేకర్​ పెట్టారు. యాక్సిడెంట్​లో ముఖమంతా దెబ్బతింది. మీ అందరి ఆశీర్వాదంతో వీటిని ఎదుర్కొని గెలవగలిగాను” అని చెప్పింది సైనీ.