
భారత వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మాన్ గిల్ ను ఎంపిక చేసి సెలక్షన్ కమిటీ అనూహ్య మార్పు తీసుకుంది. ప్రస్తుతం టెస్ట్ జట్టును నడిపిస్తున్న గిల్.. త్వరలోనే భారత వన్డే జట్టును నడిపించనున్నాడు. ఆస్ట్రేలియాతో అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కు తొలిసారి శుభమాన్ జట్టును లీడ్ చేయనున్నాడు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఒకే ఫార్మాట్ ఆడుతున్న రోహిత్ శర్మను 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కెప్టెన్ గా కొనసాగించలేమని అగార్కర్ చెప్పాడు. అంతేకాదు మూడు ఫార్మాట్ లకు ముగ్గురు కెప్టెన్ లు ఇండియన్ క్రికెట్ టీంలో ఉంచే ఉద్దేశ్యం లేదని చీఫ్ సెలక్టర్ అన్నాడు.
తొలిసారి వన్డే కెప్టెన్ గా నియమించిన తర్వాత గిల్ స్పందించాడు. కెప్టెన్సీ తన కెరీర్‌లో ఇప్పటివరకు "అతిపెద్ద గౌరవం"గా గిల్ భావించాడు. వన్డే క్రికెట్‌లో దేశాన్ని నడిపించడం తనకు గర్వకారణమని.. కెప్టెన్ పాత్ర గౌరవంగా ఛాలెంజ్ గా భావిస్తున్నానని గిల్ అన్నాడు. గిల్ మాట్లాడుతూ.. "వన్డే క్రికెట్‌లో దేశాన్ని నడిపించడం నాకు లభించిన అతిపెద్ద గౌరవం. బాగా ఆడిన జట్టుకు నాయకత్వం వహించడం నాకు చాలా గర్వకారణం. నేను గొప్పగా రాణించగలనని ఆశిస్తున్నాను. ప్రపంచ కప్ ఆడటానికి ముందు మనకు దాదాపు 20 వన్డేలు ఉన్నాయి. సౌతాఫ్రికాలో 2027 వన్డే వరల్డ్ కప్ గెలవడమే అంతిమ లక్ష్యం". అని గిల్ చెప్పుకొచ్చాడు.
2027 వన్డే ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ గిల్ ను వన్డే సారధిగా ఉంచాలని సెలక్టర్లు భావించారు. ఈ విషయాన్ని సెలక్టర్లు గిల్ కు తెలియజేసినట్టు సమాచారం. ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో గిల్ కెప్టెన్సీ చేస్తున్న గిల్ వన్డేల్లోనూ తన కెప్టెన్ తో అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా వన్డే జట్టులో సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులో ప్లేయర్లుగా కొనసాగనున్నారు. ఇటీవలే జరిగిన ఆసియా కప్ లోనూ గిల్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
2026 నుంచి ఆల్ ఫార్మాట్ కెప్టెన్ గా గిల్:
2026 టీ20 వరల్డ్ కప్ కు సూర్య కెప్టెన్ గా కొనసాగడం ఖాయం. అయితే ఆ తర్వాత సూర్య తన కెప్టెన్సీని కోల్పోయే ప్రమాదం కనిపిస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ వయసు 34 సంవత్సరాలు. 2026 సెప్టెంబర్ కు అతనికి 36 ఏళ్ళు నిండుతాయి. వయసు ఎక్కువ కావడంతో భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ స్థానంలో వైస్ కెప్టెన్ గా ఉన్న యంగ్ క్రికెటర్ గిల్ కు కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్సీ చేస్తున్న గిల్.. త్వరలో వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.