
- రోహిత్ మార్గంలోనే నడుస్తాం
- కోహ్లీలో చురుకుదనం ఎక్కువ
లండన్: జట్టులో ప్రతి ఒక్కరూ భద్రంగా, సంతోషంగా ఉండే సంస్కృతిని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇండియా టెస్ట్ టీమ్ కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. సీనియర్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత కుర్రాళ్లతో కూడిన ఇండియా టీమ్.. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో గిల్ జట్టు గురించి మాట్లాడాడు. ‘నా కలలో కూడా నేను ఇండియా టీమ్‌కు కెప్టెన్ అవుతానని అనుకోలేదు. మనం సాధించిన విజయాలు, ట్రోఫీలను పక్కనబెడితే జట్టులో అందరూ సురక్షితంగా, సంతోషంగా ఉండేలా టీమ్ సంస్కృతిని నిర్మించాలనుకుంటున్నా. మనం ఆడే మ్యాచ్‌లు, పోటీతత్వం, భిన్నమైన జట్ల వల్ల ఇది కాస్త కష్టమైన పనే అని తెలుసు. అయినా నేను అలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ప్రతి ప్లేయరు సురక్షితంగా ఉండే వాతావరణాన్ని కల్పించాలి. దానివల్ల ప్లేయర్లలో ఉండే శక్తి సామర్థ్యాలు భద్రంగా ఉంటాయని నేను భావిస్తున్నా. ఓ కెప్టెన్‌గా నేను చేయవలసిన ముఖ్యమైన పని కూడా ఇదే’ అని గిల్ పేర్కొన్నాడు.
రోహిత్ బాటలోనే..
మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తనకు స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించాడని గిల్ తెలిపాడు. ‘రోహిత్ దూకుడుగా లేనట్లు అనిపించొచ్చు. కానీ వ్యూహాల పరంగా చాలా దూకుడుగా ఉంటాడు. మ్యాచ్‌కు ముందు, సిరీస్ సమయంలో ఆ తర్వాత కూడా ప్లేయర్ల నుంచి అతను ఏం కోరుకుంటున్నాడో స్పష్టంగా చెబుతాడు. నేను కూడా అదే మార్గాన్ని అనుసరించాలనుకుంటున్నా. రోహిత్ ఎల్లప్పుడూ వ్యక్తుల కంటే జట్టును ముందుంచాడు. అతను ఏర్పాటు చేసిన వాతావరణాన్ని నేను కొనసాగించాలనుకుంటున్నా. రోహిత్ ఎప్పుడైనా తిట్టినా మేం మనసుకు తీసుకోలేదు. అతని వ్యక్తిత్వం అలాంటిది. అది గొప్ప లక్షణంగా నేను భావిస్తున్నా. రోహిత్ భాయ్ చాలా దృడంగా ఉంటాడు. మనపై కఠినంగా ఉన్నప్పటికీ అతని హృదయం లోపలి నుంచి అది రాలేదని మనకు అర్థమవుతుంది. కేవలం జట్టు దృక్కోణం నుంచే వస్తుందని గ్రహిస్తాం’ అని గిల్ వెల్లడించాడు.
జట్టును ముందుకు తీసుకెళ్లే క్రమంలో రోహిత్‌తో తాను రెండుసార్లు మాట్లాడానని చెప్పాడు. రాబోయే 10–15 ఏండ్లలో టీమ్ కల్చర్ ఎక్కడ ఉండాలో వివరించాడన్నాడు. ఇక విరాట్ కోహ్లీ చురుకైన నాయకత్వం నుంచి కూడా తాను చాలా నేర్చుకున్నానని తెలిపాడు. ‘నేను కోహ్లీ నేతృత్వంలో ఆడినప్పుడు అతని ఆలోచనలతో మ్యాచ్‌లను చురుకుగా ఉంచేవాడు. అది నాకు బాగా నచ్చింది. ఒక ప్లాన్ పని చేయడం లేదని భావిస్తే వెంటనే రెండో ఆలోచనతో వచ్చేవాడు. బౌలర్ నుంచి ఏం కోరుకుంటున్నాడో స్పష్టంగా చెప్పేవాడు’ అని గిల్ వ్యాఖ్యానించాడు.
నాపై అంచనాల్లేవు..
కెప్టెన్సీ తీసుకునేటప్పుడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో జరిగిన సంభాషణ గురించి గిల్ చెప్పాడు. ‘వాళ్లిద్దరు నన్ను నాయకుడిగా నిరూపించుకోవాలని మాత్రమే కోరుకుంటున్నారు. నాపై ఎటువంటి అంచనాల్లేవు. నేను ఏదో సాధిస్తానని కూడా వాళ్లు ఆశించడం లేదు. ఒక కెప్టెన్‌గా, ప్లేయర్‌గా కొన్ని అంచనాలను నాలో చూశారు. వాటిని నిరూపించుకుంటే చాలు’ అని గిల్ వెల్లడించాడు.
కెప్టెన్సీకి సంబంధించిన చర్చలను తన తండ్రికి కూడా తెలియనివ్వలేదన్నాడు. ‘నేను టీమిండియా టెస్ట్ కెప్టెన్‌ని అవుతానని మా నాన్న కలలో కూడా ఊహించలేదు. నాకు తెలిసింది ఇండియాకు ఆడటం, మ్యాచ్‌లు గెలిపించడం మాత్రమే. కెప్టెన్సీ వార్త బయటకు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేశాడు. కానీ అధికారికంగా వెల్లడైన తర్వాతే చెబుదామని నేను కూడా ఏ విషయం చెప్పలేదు. కెప్టెన్సీ గురించి అధికారికంగా తెలిసిన తర్వాత మా మధ్య మంచి సంభాషణ జరిగింది’ అని గిల్ వివరించాడు.
ఐపీఎల్లో గంభీర్ కోచింగ్ శైలిని చూసిన గిల్.. నేషనల్ టీమ్ తరఫున కూడా దానికి అలవాటు పడతాననే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ‘గౌతమ్ భాయ్‌కు ధృడ సంకల్పం ఎక్కువ. చాలా నిబద్ధతతో ఉంటాడు. తను అనుకున్న విషయాలను చాలా స్పష్టంగా చెబుతాడు. ఆటగాళ్లు ఎలా ఉండాలి, వారి నుంచి ఏం కోరుకుంటున్నాడు, వాళ్ల మనస్తత్వం ఎలా ఉండాలనే దానిపై చాలా స్పష్టతతో ఉంటాడు. ప్లేయర్లపై కాకుండా జట్టుపై ఎక్కువగా దృష్టిపెడతాడు’ అని గిల్ చెప్పుకొచ్చాడు.
వర్క్‌లోడ్‌ను బట్టే బుమ్రాపై నిర్ణయం
గాయాలతో ఇబ్బందిపడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను పని భారాన్ని బట్టే మ్యాచ్‌ల్లో ఆడిస్తామని గిల్ స్పష్టం చేశాడు. ‘బుమ్రా ఆడటం అనేది ఒక్కో మ్యాచ్‌పై ఆధారపడి ఉంటుంది. అతనిపై ఎంత వర్క్‌లోడ్ పడుతుందో చూడాలి. దాన్ని బట్టే ఎన్ని మ్యాచ్‌ల్లో ఆడించాలనేది నిర్ణయించుకుంటాం. కచ్చితంగా ఇన్ని మ్యాచ్‌ల్లో ఆడించాలనే కఠినమైన వైఖరి ఉండదు. తర్వాతి మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది వర్క్‌లోడ్‌ను బట్టి ఉంటుంది’ అని గిల్ తెలిపాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ‘బజ్‌బాల్’ స్ట్రాటజీని ఎదుర్కోవడానికి తాము ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదన్నాడు. ఈ నెల 20 నుంచి జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్ మొదలవనుంది.