Asia Cup 2025: ప్రత్యర్థులుగా పంజాబ్ ప్లేయర్స్: యూఏఈ జట్టులో గిల్ చిన్నప్పటి ఫ్రెండ్

Asia Cup 2025: ప్రత్యర్థులుగా పంజాబ్ ప్లేయర్స్: యూఏఈ జట్టులో గిల్ చిన్నప్పటి ఫ్రెండ్

ఆసియా కప్ లో గురువారం (సెప్టెంబర్ 10) ఇండియా, యూఏఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక విషయం ఆసక్తికరంగా మారింది. భారత సంతతికి చెందిన ఇండియన్ ప్లేయర్ సిమర్జీత్ సింగ్ యూఏఈ జట్టులో ఉండడమే ఇందుకు కారణం. అంతేకాదు ఈ యూఏఈ ఫాస్ట్ బౌలర్ కు టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుభమాన్ గిల్ చిన్నప్పటి స్నేహితులు కావడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సిమర్జీత్ సింగ్ బౌలింగ్ లో గిల్ విన్నింగ్ షాట్ ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించడం మరో హైలెట్. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిందో ఇప్పుడు చూద్దాం..  

గిల్, సిమర్జీత్ సింగ్ ఇద్దరూ పంజాబ్ కు చెందినవారు. చిన్నప్పుడు వీరిద్దరూ కలిసి ఆడేవారు. 2011-12లో గిల్ అండర్-16 డివిజన్‌లో ఆడుతున్నప్పుడు సిమర్జీత్ సింగ్ మొహాలీలోని పిసిఎ గ్రౌండ్‌లోని నెట్స్‌లో బౌలింగ్ చేసేవాడు. 2021 నుండి సిమర్జీత్ దుబాయ్‌లో సెటిల్ అయ్యాడు. జూనియర్ ఆటగాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి డబ్బు సంపాదించేవాడు. ఈ క్రమంలో యూఏఈ జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున కూడా ఆడిన సిమర్జీత్ సింగ్ CSK ఫ్యాన్స్ కు సుపరిచితమే. పదేళ్ల తర్వాత గిల్, సిమర్జీత్ సింగ్ కలుసుకోవడం గమనార్హం.     

►ALSO READ | Asia Cup 2025: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచినా పాకిస్థాన్‌పై కుల్దీప్ ఆడడు: భారత మాజీ క్రికెటర్

మరోవైపు గిల్ కెప్టెన్సీలో 2018లో ఇండియా అండర్-19 వరల్డ్ కప్ గెలుచుకుంది. నిలకడగా ఆడుతూ 2019లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. 2022 నాటికి వన్డే ఫార్మాట్‌లో.. 2024 నాటికి టెస్ట్ ల్లో రెగ్యులర్‌ ప్లేయర్ గా మారాడు. టీ20 క్రికెట్ లో కూడా తన స్థానాన్ని పదిలం చేసుకునే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం గిల్ టీమిండియా టెస్ట్ కెప్టెన్ కాగా.. టీ20, వన్డే వైస్ కెప్టెన్. మ్యాచ్ కు ముందు వరకు వీరిద్దరూ మాట్లాడుకుంటారు లేదా అనే అనుమానాలు ఉన్నాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్ అతని వద్దకు వెళ్లి కౌగిలించుకోవడంతో వీరిద్దరి మధ్య ఉన్న బాండ్ వైరల్ అయింది.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే యూఏఈతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 9 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. టీమిండియా ధాటికి ఆతిధ్య జట్టుకు ఘోర పరాభవమే మిగిలింది. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఇండియా 4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.