దులీప్‌‌ ట్రోఫీలో నార్త్‌ జోన్‌ కెప్టెన్‌గా శుభమన్ గిల్‌

దులీప్‌‌ ట్రోఫీలో నార్త్‌ జోన్‌ కెప్టెన్‌గా శుభమన్ గిల్‌

న్యూఢిల్లీ: ఇండియా టెస్ట్‌‌ కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌.. దులీప్‌‌ ట్రోఫీలో నార్త్‌‌ జోన్‌‌ టీమ్‌‌ను నడిపించనున్నాడు. ఈస్ట్‌‌ జోన్‌‌తో జరిగే తొలి మ్యాచ్‌‌లో అతను బరిలోకి దిగనున్నాడు. ఒకవేళ ఆసియా కప్‌‌కు సెలెక్ట్‌‌ అయితే యూఏఈకి బయలుదేరనున్నాడు. ఆగస్టు 28 నుంచి బెంగళూరులో మొదలయ్యే ఈ టోర్నీలో నార్త్‌‌ జోన్‌‌.. ఈస్ట్‌‌ జోన్‌‌తో, సెంట్రల్‌‌ జోన్‌‌.. నార్త్‌‌ ఈస్ట్‌‌ జోన్‌‌తో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో 15 మందితో కూడిన నార్త్‌‌ జోన్‌‌ టీమ్‌‌ను సెలెక్టర్లు గురువారం ప్రకటించారు. లెఫ్టార్మ్‌‌ పేసర్‌‌ అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌, హర్షిత్‌‌ రాణా, అన్షుల్‌‌ కాంబోజ్‌‌కు చోటు కల్పించారు.

2024–25 రంజీ సీజన్‌‌లో 14 ఇన్నింగ్స్‌‌ల్లో 574 రన్స్‌‌తో హర్యానా తరఫున టాప్‌‌ స్కోరర్‌‌గా నిలిచిన అంకిత్‌‌ కుమార్‌‌ను వైస్‌‌ కెప్టెన్‌‌గా ఎంపిక చేశారు. లెఫ్టార్మ్‌‌ స్పిన్‌‌ బౌలింగ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ నిశాంత్‌‌ సింధు, ఆయుష్‌‌ బదోనీ, యష్‌‌ ధుల్‌‌కు కూడా చాన్స్‌‌ లభించింది. జమ్మూ కశ్మీర్‌‌ నుంచి ఐదుగురు ప్లేయర్లు బరిలో ఉన్నారు. సీనియర్‌‌ ఓపెనర్‌‌ శుభమ్‌‌ ఖజురియా, పేసర్‌‌ అకీబ్‌‌ నబీకి అవకాశం దక్కింది. 

సెంట్రల్‌‌ జట్టులో జురెల్‌‌, కుల్దీప్‌‌

ఇండియా వికెట్ కీపర్ ధ్రువ్‌‌ జురెల్‌‌ సెంట్రల్‌‌ జోన్‌‌ జట్టుకు కెప్టెన్‌‌గా ఎంపికయ్యాడు. లెఫ్టార్మ్‌‌ రిస్ట్‌‌ స్పిన్నర్‌‌ కుల్దీప్‌‌ యాదవ్‌‌తో పాటు లెఫ్టార్మ్‌‌ స్పిన్నర్‌‌ హర్ష్‌‌ దూబే, మానవ్‌‌ సుతార్‌‌ను కూడా ఈ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఓ రంజీ సీజన్‌‌లో 69 వికెట్లు తీసి దూబే ఇప్పటికే చరిత్ర సృష్టించాడు. ఖలీల్‌‌ అహ్మద్‌‌ పేస్‌‌ బృందానికి నాయకత్వం వహించనున్నాడు. దీపక్‌‌ చహర్‌‌తో కలిసి కొత్త బాల్‌‌ను పంచుకోనున్నాడు. లాస్ట్‌‌ రంజీ సీజన్‌‌ (960 రన్స్‌‌) టాపర్‌‌గా నిలిచిన యష్‌‌ రాథోడ్‌‌కు అవకాశం లభించింది.

సెంట్రల్‌‌ జట్టు: ధ్రువ్‌‌ జురెల్‌‌ (కెప్టెన్‌‌), రజత్‌‌ పటీదార్‌‌, ఆర్యన్‌‌ జుయల్‌‌, ఆయుష్‌‌ పాండే, డానిష్‌‌ మలేవర్‌‌, శుభమ్‌‌ శర్మ, సంచిత్‌‌ దేశాయ్‌‌, యష్‌‌ రాథోడ్‌‌, కుల్దీప్‌‌ యాదవ్‌‌, హర్ష్‌‌ దూబే, ఆదిత్య థాక్రే, మానవ్‌‌ సుతార్‌‌, దీపక్‌‌ చాహర్‌‌, ఖలీల్‌‌ అహ్మద్‌‌, సారాన్ష్‌‌ జైన్‌‌. స్టాండ్‌‌ బై: మహిపాల్‌‌ లోమ్రోర్‌‌, యష్‌‌ ఠాకూర్‌‌, మాధవ్‌‌ కౌశిక్‌‌, కుల్దీప్‌‌ సేన్‌‌, యువరాజ్‌‌ చౌదరీ, ఉపేంద్ర యాదవ్‌‌.

నార్త్ జోన్ జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్), అంకిత్ కుమార్ (వైస్ కెప్టెన్), శుభమ్ ఖజురియా, ఆయుష్ బదోనీ, యష్ ధుల్, అంకిత్ కల్సి, నిశాంత్ సింధు, సాహిల్ సింగ్‌‌వీర్, యుక్వీర్, అర్ష్‌‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, అకీబ్‌‌ నబీ, కన్హయ్య వాధావన్.