
టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ దులీప్ ట్రోఫీకి దూరమయ్యాడు. గురువారం (ఆగస్టు 28) నుంచి 6 జట్ల మధ్య దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇండియాలో జరగబోయే ఈ డొమెస్టిక్ టోర్నీలో గిల్ మొదట నార్త్ జోన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే ఇప్పుడు ఈ టోర్నీకి ఈ టీమిండియా టెస్ట్ కెప్టెన్ అందుబాటులో ఉండడం లేదు. రేపు టోర్నీ ప్రారంభం కానున్నప్పటికీ గిల్ ఇంకా నార్త్ జోన్ జట్టులో చేరలేదు. దీంతో ఈ సీజన్ లో గిల్ దులీప్ ట్రోఫీకి దూరంగా ఉండనున్నాడు.
గిల్ దులీప్ ట్రోఫీకి దూరం కావడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి అతను పూర్తిగా ఫిట్ నెస్ తో లేడు. ఇటీవలే వైరల్ ఫీవర్ తో ఇబ్బందిపడిన శుభమాన్ అనారోగ్యానికి గురయ్యాడు. ఆ తర్వాత కోలుకున్న గిల్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. దీంతో పాటు సెప్టెంబర్ 9 నుంచి జరగనున్న ఆసియా కప్ స్క్వాడ్ లో గిల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. దులీప్ ట్రోఫీకి ఆసియా కప్ క్లాష్ కానుండడంతో ఈ టోర్నీకి అందుబాటులో ఉండడం లేదు. గిల్ దూరం కావడంతో అతని స్థానంలో నార్త్ జోన్ కెప్టెన్‌గా అంకిత్ కుమార్ ఎంపిక కానున్నాడు.
ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు తలపడనున్నాయి. నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. ప్రారంభ మ్యాచ్‌లో నార్త్ జోన్ ఈస్ట్ జోన్‌తో తలపడుతుంది. సెంట్రల్ జోన్ క్వార్టర్ ఫైనల్స్‌లో నార్త్ ఈస్ట్ జోన్‌తో తలపడుతుంది. 2023లో చివరి జోనల్ ఎడిషన్‌లో ఫైనలిస్టులుగా నిలిచిన సౌత్ జోన్, వెస్ట్ జోన్ సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఈ టోర్నమెంట్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిర్వహించబడుతుంది. సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు ఫైనల్ జరుగుతుంది.