రివ్యూ : శ్యామ్ సింగరాయ్

రివ్యూ : శ్యామ్ సింగరాయ్
  • నటీనటులు : నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ తదితరులు
  • దర్శకత్వం : రాహుల్ సంకృత్యాన్
  • నిర్మాత : వెంకట్ బోయనపల్లి
  • సంగీత దర్శకుడు : మిక్కీ జే మేయర్
  • సినిమాటోగ్రఫీ : సాను జాన్ వర్గీస్
  • రిలీజ్ డేట్ : డిసెంబర్ 24, 2021

నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఉప్పెన భామ కృతి శెట్టి సెకండ్ హీరోయిన్ గా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచింది. నాని ద్విపాత్రాభినయం చేయడంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. రెండేళ్ల తర్వాత థియేటర్లలో విడుదలైన నాని సినిమాప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? డ్యూయెల్ రోల్ లో నాని, దేవదాసిగా సాయిపల్లవి, కృతి శెట్టిల నటన ప్రేక్షకుల అంచనాలను అందుకుందా?

కథేంటంటే?
సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే వాసు (నాని)కి డైరక్టర్ అవ్వాలన్నది కల. దాన్ని నిజం చేసుకునేందుకు ఉద్యోగం కూడా వదిలేస్తాడు. కీర్తి (కృతి శెట్టి) ప్రధాన పాత్రలో తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ అందరికీ నచ్చడంతో సినిమా డైరెక్ట్ చేసే అవకాశం దక్కుతుంది. ఆ మూవీ కూడా సూపర్ హిట్ కావడంతో దాన్ని బాలీవుడ్ రీమేక్ చేసేందుకు ఓ సంస్థ ముందుకొస్తుంది. అనుకోని పరిస్థితుల్లో వాసు కాపీ రైట్ కేసులో అరెస్ట్ అవుతాడు. బెంగాలీ రైటర్ శ్యామ్ సింగరాయ్ కథలను కాపీ చేశారని మనోజ్ సింగరాయ్ (రాహుల్ రవీంద్రన్) కోర్టు కెక్కుతాడు. ఆ తర్వాత కథ ఎలా మలుపు తిరిగింది. వాసు నిజంగా కథలు కాపీ కొట్టాడా? ఇంతకీ శ్యామ్ సింగరాయ్ కు వాసుకు మధ్య ఉన్న సంబంధమేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

సినిమా ఎలా ఉంది?
పునర్జన్మల కాన్సెప్ట్ తో శ్యామ్ సింగరాయ్ మూవీ తెరకెక్కింది. దేవదాసిల పరిస్థితుల గురించి చిత్రంలో చర్చించారు. దేవదాసి అయిన సాయిపల్లవిని నాని ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత ఫ్యామిలీతో పాటు వ్యవస్థపై పోరాటం.. పరువు కోసం సొంత అన్నల చేత హత్యకు గురవడం, చనిపోతూ మళ్లీ వస్తానంటూ  భార్యకు మాట ఇవ్వడం, డైరెక్టర్ గా కాపీ రైట్ వివాదంలో చిక్కుకోవడం, దాన్నుంచి ఎలా బయటపడ్డాడన్నదే సినిమా కాన్సెప్ట్. స్టోరీ కొత్తది కాకపోయినా స్క్రీన్ ప్లే కొత్తదనం చూపి కనికట్టు చేయడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ కోసం వాసుదేవ్... కీర్తి ని ఒప్పించటం.. దర్శకుడిగా మారి కాఫీ రైట్ కేసుతో కోర్టులో వాదోపవాదనలు జరగటం వరకు కథ సాదాసీదాగా సాగుతుంది. సెకండాఫ్ లో కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో శ్యామ్ సింగరాయ్... దేవదాసి అయిన సాయి పల్లవిని ప్రేమించే సీన్స్.. ఆమె కోసం పోరాడే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. 

నటీనటుల పనితీరు : 
నేచురల్ స్టార్ నాని రెండు పాత్రల్లో మెప్పించాడు. దేవదాసిగా సాయిపల్లవి తన నటనతో మరోసారి మెప్పించింది. కృతి శెట్టి పాత్ర నాని గర్ల్ ఫ్రెండ్ గా కొన్ని సీన్లకు పరిమితమైంది.

టెక్నికల్ వర్క్ : 
సినిమాలో పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.  ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే సిరివెన్నెల సాంగ్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. సినిమాటోగ్రఫీ వర్క్ కు కూడా మంచి మార్కులు పడతాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

విశ్లేషణ :

పునర్జన్మల కాన్సెప్ట్ తో వచ్చిన శ్యామ్ సింగరాయ్ ప్రేక్షకుల్ని అనుకున్నంతగా మెప్పించలేకపోయింది. కథకు తగ్గట్లుగా బలమైనసన్నివేశాలు రాసుకోవడంలో విఫలమయ్యారు. వాసునే శ్యామ్ సింగరాయ్ అని నిరూపించే సీన్లు కన్విన్సింగ్ గా చూపలేకపోయారు. 

బాటమ్ లైన్ : 
శ్యామ్ సింగరాయ్ ను ఒకసారి చూడొచ్చు.