హైదరాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న ఎస్సై గుండెపోటుతో కుప్పకూలడం తీవ్ర విషాదాన్ని నింపింది. మంగళవారం (డిసెంబర్ 03) తెల్లవారుజామున ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై సంజయ్ సావంత్(58) మృతి చెందాడు.
సోమవారం రాత్రి నైట్ డ్యూటీలో భాగంగా పోలీస్ స్టేషన్ బ్యారక్ లో ఉన్న సమయంలో.. మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలాడు. విధుల్లో ఉన్న ఇతర కానిస్టేబుల్స్ వెంటనే ఎస్సైని సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు డిక్లేర్ చేశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు తోటి పోలీసులు సమాచారం అందించారు.
ఎస్సై సంజయ్ గత రెండేళ్లుగా ఎల్బీనగర్ పీఎస్ లో పనిచేస్తున్నారు. 1989లో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయిన సంజయ్.. ఈ మధ్యే ఎస్సైగా ప్రమోట్ అయ్యి విధులు నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
