ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధ క్షేత్రం.. టూరిస్టులకు ‘సియాచిన్’ వెల్ కం

ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధ క్షేత్రం.. టూరిస్టులకు ‘సియాచిన్’ వెల్ కం
  • సియాచిన్ ఆర్మీ బేస్ కు పర్యాటకులు రావొచ్చు
  • రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధ క్షేత్రమది. కడ్డకట్టే మంచు కొండల మధ్య మన సైనికులు నిత్యం పహారా కాసే చోటు.. కఠిన శిక్షణ పొందిన జవాన్లనే ముప్పతిప్పలు పెట్టే వాతావరణానికి నెలవు. మైనస్ 18 నుంచి మైనస్ 60 డిగ్రీల కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రాతమది. అదే సియాచిన్ ఆర్మీ బేస్.

ఈ ప్రాంతానికి ఇప్పుడు సామాన్యుల సైతం వెళ్లొచ్చు. సాహస యాత్ర చేయాలన్న ఆశ ఉన్నోళ్లకు సియాచిన్ ఇక స్వాగతం పలుకుతుంది. ఆర్మీ బేస్ వరకు టూరిస్టులు రావొచ్చని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ (సోమవారం) ప్రకటన చేశారు.

ఆర్మీ సాయంతో..

అత్యంత క్లిష్టమైన ఈ ప్రాంతంలో ఆర్మీ బేస్ వద్దకు చేరుకునే అవకాశాన్ని పర్యాటకులకు కల్పించాలని నిర్ణయం తీసుకోవడమే ఓ సాహసమని చెప్పాలి. మైనస్ ఉష్ణోగ్రతల్లో సైతం మన సైనికులు దేశ రక్షణకు ఎలా పహారా కాస్తున్నారో సామాన్యులకు చూపించాలని కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చింది. దేశంపై వారి ప్రేమ, నిస్వార్థ సేవ చేస్తున్న తీరును చూపించడం ద్వారా ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించొచ్చని భావిస్తోంది మోడీ సర్కార్. ఈ ప్రాంతానికి వెళ్లాలనుకునే యాత్రికులకు కఠిన శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే వారికి ఆర్మీ సాయం కూడా అందుతుందని తెలుస్తోంది.

లఢఖ్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. షియోక్ నదిపై నిర్మించిన బ్రిడ్జిని ఆర్మీ చీప్ బిపిన్ రావత్ తో కలిసి ఆయన జాతికి అంకితం చేశారు. దీని ద్వారా చైనాతో సరిహద్దును పంచుకునే దౌలత్ బేగ్ ఓల్దీ సెక్టర్ కు లఢక్ నుంచి మన సేనలు సులభంగా చేరుకోగలుగుతాయి.

పర్యాటకంగా లఢఖ్ సూపర్

పర్యాటకంగా లఢఖ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని రాజ్ నాథ్ అన్నారు. ఏటా భారీ సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారని చెప్పారాయన. ఇప్పడు సియాచిన్ వద్దకు చూడా పర్యాటకుల్ని అనుమతించాలని నిర్ణయించామన్నారు. సియాచిన్ బేస్ క్యాంప్ నుంచి కుమార్ సోస్ట్ వరకు టూరిస్టులు వెళ్లొచ్చని చెప్పారు రాజ్ నాథ్.

పాక్ కుట్ర భగ్నం.. ఆపరేషన్ మేఘదూత్ తో సొంతం

హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న సియాచిన్.. సముద్ర మట్టానికి 11875 నుంచి 18875 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఈ ప్రాంతాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు పాక్ పన్నిన కుట్రను పసిగట్టిన భారత ఆర్మీ దాన్ని భగ్నం చేసింది. ‘ఆపరేషన్ మేఘదూత్’ షురూ చేసింది. 1984 ఏప్రిల్ 13న  ఈ ప్రాంతాన్ని భారత్ సొంతం చేసుకుంది. నాటి నుంచి అక్కడ అత్యంత కఠిన వాతావరణంలోనూ మన సైనికులు పహారా కాస్తున్నారు.