బెంగుళూర్: కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పుపై అసెంబ్లీ వేదికగా సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని.. ఎలాంటి పవర్ షేరింగ్ లేదని కుండబద్దలు కొట్టారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో రెండున్నరేళ్ల అధికార భాగస్వామ్య ఒప్పందాన్ని ఆయన తిరస్కరించారు. సీఎం మార్పు విషయంలో పార్టీ హైకమాండ్ ఏదైనా నిర్ణయం తీసుకునే వరకు తానే కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగుతానని తేల్చిచెప్పారు.
శుక్రవారం (డిసెంబర్ 19) కర్నాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక రెండున్నర సంవత్సరాల ఒప్పందంపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. రెండున్నర సంవత్సరాల ఒప్పందం గురించి మేం ఎప్పడూ చెప్పలేదని.. అసలు రెండున్నర సంవత్సరాల పవర్ షేరింగ్ అనే అగ్రిమెంట్ లేనే లేదన్నారు. అధికార నాయకత్వ మార్పు విషయంలో పార్టీ హైకమాండ్ ఏదైనా నిర్ణయం తీసుకునే వరకు తానే కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సిద్ధరామయ్య ప్రతిపక్షాలకు క్లారిటీ ఇచ్చారు.
కర్ణాటకలో నాయకత్వ మార్పు పోరు:
కర్నాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా సీఎం మార్పుపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రెండున్నరేళ్ల పవర్ షేరింగ్ ఒప్పందంలో భాగంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అధికారం కోసం తీవ్ర పోటీ నడుస్తోంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు అప్పగించాలని ఆయన వర్గం ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌ను కూడా కలిశారు.
►ALSO READ | అమెరికాలో గ్రీన్ కార్డ్ లాటరీ బంద్.. బ్రౌన్ యునివర్సిటీ కాల్పుల వల్లే నిర్ణయం...
మరోవైపు సీఎం పీఠం దిగేందుకు సిద్ధరామయ్య ససేమిరా అంటున్నాడు. దీంతో సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ నెలకొంది. సీఎం కుర్చీ విషయంలో ఇద్దరే తేల్చుకోవాలని హైకమాండ్ సూచించడంతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ రెండుసార్లు కలిసి చర్చించారు. ఈ క్రమంలో హైకమాండ్ ఆదేశించే వరకు తానే సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య అసెంబ్లీ వేదికగా ప్రకటించడం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
