సీఎం మార్పుపై క్లారిటీ ఇవ్వండి.. రాహుల్‌‎కు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ విజ్ఞప్తి

సీఎం మార్పుపై క్లారిటీ ఇవ్వండి.. రాహుల్‌‎కు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ విజ్ఞప్తి

బెంగళూరు: కర్నాటకలో ముఖ్యమంత్రి పదవి వివాదం మరోసారి హాట్ టాపిక్‌‌గా మారింది. సీఎం మార్పు, పవర్ షేరింగ్ అంశంపై చర్చించడానికి ఢిల్లీకి రావాలని సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్‌‌లను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోరినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం రాహుల్ గాంధీ తమిళనాడుకు (గుడలూరుకు) వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా మైసూరు ఎయిర్ పోర్టులో ఆగారు. అప్పుడు ఆయన శివకుమార్‌‌తో 3  నుంచి5 నిమిషాల పాటు ప్రైవేట్‌‌గా (టార్మాక్‌‌పై) మాట్లాడారు. 

ఆ తర్వాత అక్కడకు సిద్ధరామయ్య కూడా చేరుకున్నారు. ముగ్గురూ కాసేపు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. పార్టీ వర్గాల ప్రకారం.. రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య, శివకుమార్‌‌ల మధ్య జరిగిన చర్చలు సీఎం మార్పు, పవర్ షేరింగ్ అంశాలపై స్పష్టత కోసం జరిగినవిగా తెలుస్తోంది. ఊహాగానాలకు ముగింపు పలకాలని, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లేదా నాయకత్వ మార్పు అంశాలపై స్పష్టత ఇవ్వాలని రాహుల్‌‌ను నేతలు కోరినట్లు సమాచారం. నేతల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాహుల్.. ఆయా అంశాలపై చర్చించేందుకు సిద్ధరామయ్య, శివకుమార్‌‌లను ఢిల్లీకి పిలిచినట్లు తెలుస్తున్నది. 

ఈ చర్చలకు కచ్చితమైన తేదీ ఖరారు కాలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని, అన్నీ మీడియా ఊహాగానాలు మాత్రమేనని చెప్పారు.  పార్టీలో ఎలాంటి గందరగోళం లేదని, అధిష్ఠానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని మరోసారి స్పష్టం చేశారు. శివకుమార్ స్పందిస్తూ..రాహుల్ గాంధీతో జరిగిన చర్చలు పార్టీ ప్రోటోకాల్ ప్రకారమేనని తెలిపారు. సీఎం మార్పు లాంటి ఊహాగానాలు మీడియా సృష్టించినవేనని పేర్కొన్నారు.