సీఎం మార్పుపై ఏదో ఒకటి తేల్చండి..కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ హైకమాండ్‌‌‌‌‌‌‌‌ను కోరిన సిద్ధరామయ్య

సీఎం మార్పుపై ఏదో ఒకటి తేల్చండి..కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ హైకమాండ్‌‌‌‌‌‌‌‌ను కోరిన సిద్ధరామయ్య

బెంగళూరు: కర్నాటకలో సీఎం మార్పు గురించి వస్తున్న ఊహాగానాలపై సీఎం సిద్ధరామయ్య మంగళవారం స్పందించారు. ఈ గందరగోళానికి ఫుల్‌‌‌‌‌‌‌‌స్టాప్‌‌‌‌‌‌‌‌ పెట్టాలంటే పార్టీ హైకమాండ్‌‌‌‌‌‌‌‌ నిర్ణయం తీస్కోవాలని కోరారు. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. 

2023 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ గెలిచిన తర్వాత సీఎం పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య కుదిరిన అవగాహన ప్రకారం రెండేండ్ల తర్వాత సీఎం పదవి మార్పు ఉంటుందనే ప్రచారం జరిగింది. ఆ సమయం నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20  నాటికి పూర్తికావడంతో సీఎం పదవీమార్పు ఉంటుందనే ఊహాగానాలు పెరిగాయి. 

ఇందుకుతోడు రాష్ట్రంలో అనూహ్య మార్పు రాబోతోందంటూ విపక్ష నేతలుకూడా కామెంట్లు చేయడంతో కర్నాటక సీఎం కుర్చీ హాట్‌‌‌‌‌‌‌‌ టాపిక్‌‌‌‌‌‌‌‌ అయింది. మరోపక్క డీకేను సీఎంగా ప్రకటించాలంటూ ఆయన మద్దతుదారులైన ఆరుగురు ఎమ్మెల్యేలు నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 23న ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌‌‌‌‌‌‌‌ను కలిసి కోరారు. 

గతవారం కూడా 10 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మల్లికార్జున ఖర్గేను కలిశారు. దీనిని ఉద్దేశించి సిద్ధరామయ్య స్పందిస్తూ.. ‘ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉంది, ఢిల్లీకి వెళ్లి వాళ్ల అభిప్రాయం చెప్పుకోవచ్చు. చివరికి హైకమాండ్‌‌‌‌‌‌‌‌ నిర్ణయమే అంతిమం”అని ఆయన కామెంట్‌‌‌‌‌‌‌‌ చేశారు. కేబినెట్‌‌‌‌‌‌‌‌ మార్పు గురించి ప్రశ్నిస్తే.. అదికూడా అధిష్టానం నిర్ణయం మేరకే జరుగుతుందని సమాధానమిచ్చారు.

శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే చాన్స్‌‌‌‌‌‌‌‌..

కర్నాటకలో నాయకత్వ మార్పుతో వచ్చే లాభనష్టాలను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ హైకమాండ్‌‌‌‌‌‌‌‌ అంచనా వేస్తోంది. ఒకవేళ మార్పు జరిగినా సిద్ధరామయ్య స్థానంలో డీకీ శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపిక అయ్యే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉందని, మూడో వ్యక్తికి అవకాశమే లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటివరకు తుది నిర్ణయం తీస్కోలేదని మాత్రం స్పష్టం చేస్తున్నాయి.