- 30 వేల మంది భక్తులు వస్తారని అంచనా
- జనవరి 18 నుంచి మూడు నెలల పాటు మహాజాతర
సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదివారం ఉదయం ఆలయ తోటబావి వద్ద మల్లికార్జునస్వామి బలిజ మేడల దేవి, గొల్ల కేతమ్మల కల్యాణాన్ని నిర్వహించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కల్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఐదు గంటలకు ఆలయంలో దృష్టి కుంభం, కల్యాణోత్సవం, రాత్రి రథోత్సవం నిర్వహించనున్నారు. సోమవారం లక్షబిల్వార్చన, మహా మంగళహారతి, మంత్రపుష్ప కార్యక్రమాలు జరుగుతాయి.
మల్లన్న కల్యాణానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 30 వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో.. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ రాజగోపురాన్ని ఇప్పటికే క్లీన్ చేయగా.. ప్రస్తుతం క్యూ లైన్లపైన చలువపందిళ్లు వేస్తున్నారు. తోట బావి వద్ద నిర్వహించే కల్యాణాన్ని భక్తులు తిలకించే విధంగా ప్రత్యేక గ్యాలరీలతో పాటు ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు.
రాజగోపురంతో పాటు కల్యాణ వేదిక, రాతిగీరల మండపం, కోడెల స్తంభాన్ని విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. కల్యాణ వేదిక చుట్టూ ప్రత్యేక లైటింగ్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమే కాకుండా భక్తుల సౌకర్యార్థం తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ఆలయ పరిసరాలను సెక్టార్లుగా విభజించి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి కొండా సురేఖ
కొమురవెళ్లి మల్లన్న కల్యాణనికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించేందుకు మంత్రి కొండా సురేఖకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో ఎలాంటి హడావుడి, పబ్లిసిటీ చేయొద్దని, రాజకీయ నాయకుల ఫొటోలతో బ్యానర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయొద్దని ఎన్‌ఈసీ ఆదేశించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు.
మూడు నెలల పాటు మహా జాతర
కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవాలు ముగిసిన తర్వాత జనవరి రెండో వారం నుంచి మహాజాతర ప్రారంభం కానుంది. ఇందు కోసం ఆఫీసర్లు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు నెలల్లో తొమ్మిది వారాల పాటు జరిగే మహాజాతరకు సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.
జనవరి 18 నుంచి ప్రారంభయ్యే మహాజాతర మార్చి 20న ఉగాదితో ముగియనుంది. మహాజాతరలో భాగంగా జనవరి 18న పట్నం వారం, 25న లష్కర్ వారం, ఫిబ్రవరి 15న శివరాత్రి రోజున పెద్ద పట్నం, మార్చి 16న అగ్నిగుండాలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

