కేసీఆర్​ కాళ్లు మొక్కిన కలెక్టర్లు

కేసీఆర్​ కాళ్లు మొక్కిన కలెక్టర్లు
  • సీఎంకు సిద్దిపేట కలెక్టర్​ వెంకట్రామిరెడ్డి, కామారెడ్డి కలెక్టర్​ శరత్ పాదాభివందనం

సిద్దిపేట/కామారెడ్డి, వెలుగు: సిద్దిపేట కలెక్టర్​ పి.వెంకట్రామిరెడ్డి, కామారెడ్డి కలెక్టర్​ శరత్​ సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కారు. ఆదివారం సిద్దిపేటలో నూతన కలెక్టరేట్​ను ప్రారంభించిన అనంతరం కలెక్టర్  చాంబర్​లోని కుర్చీలో  వెంకట్రామిరెడ్డిని సీఎం కేసీఆర్  కూర్చో బెట్టి అభినందించారు. వెంకట్రామిరెడ్డి  లేచి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కారు. అక్కడే ఉన్న తన భార్య, కుమారులను సీఎంకు పరిచయం చేశారు. వాళ్లు కూడా కేసీఆర్  కాళ్లు మొక్కారు. ఆ తర్వాత కామారెడ్డిలో కలెక్టరేట్  బిల్డింగ్​ ప్రారంభోత్సవానికి సీఎం హాజరయ్యారు. బిల్డింగ్​ను ప్రారంభించిన అనంతరం ఆయన కలెక్టర్​ చాంబర్​లోకి వెళ్లారు.  చాంబర్​లో కలెక్టర్​ శరత్​ తన సీట్లో కూర్చునే ముందు సీఎం కేసీఆర్​ కాళ్లకు మొక్కారు.  అత్యున్నత సివిల్ సర్వెంట్లయిన ఐఏఎస్​ ఆఫీసర్లు ఇలా రాజకీయ నాయకుడి కాళ్లు మొక్కడం ఏమిటని ప్రోగ్రామ్​లను టీవీల్లో లైవ్ టెలికాస్ట్​ చూసిన జనం ఆశ్చర్యానికి గురయ్యారు. 

వెంకట్రామిరెడ్డి.. ఇది రెండోసారి

2016లో సిద్దిపేట జిల్లా మొట్ట మొదటి కలెక్టర్ గా పి.వెంకట్రామిరెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో పదవీ బాధ్యతలు తీసుకున్నారు.  ఈ సమయంలో ఆయన కేసీఆర్ కాళ్లు మొక్కడం విమర్శలకు దారి తీయగా.. మళ్లీ ఇప్పుడు అదే సీన్​ రిపీట్​ అయింది.  గత పార్లమెంట్​ ఎన్నికల సమయంలో మల్కాజిగిరి నుంచి, దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి బరిలోకి దిగుతున్నారనే ప్రచారాలు జోరుగా సాగాయి.  

తండ్రిగా భావించి ఆశీస్సులు తీసుకున్న: వెంకట్రామిరెడ్డి

సీఎం కేసీఆర్ కాళ్లను మొక్కడం విమర్శలకు దారి తీయడంతో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి దిద్దుబాటు చర్యలకు దిగారు. శుభకార్యం జరిగే సమయంలో పెద్దల ఆశీస్సులు తీసుకోవడం తెలంగాణ సంప్రదాయని, అందులో భాగంగానే తండ్రి సమానుడైన కేసీఆర్ కాళ్లను మొక్కి ఆశీర్వాదం తీసుకున్నానని, దీనిపై రాద్ధాంతం చేయడం సరికాదని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.