సిద్దిపేట సీపీ బీఆర్ఎస్​కు తొత్తులా వ్యవహరిస్తున్నరు : సీఈఓకు రఘునందన్ ఫిర్యాదు

సిద్దిపేట సీపీ బీఆర్ఎస్​కు  తొత్తులా వ్యవహరిస్తున్నరు : సీఈఓకు రఘునందన్ ఫిర్యాదు

 

అధికార పార్టీ నేతలకే సెక్యూరిటీ పెంచుతరా?

 

  • గతంలో తనకు సెక్యూరిటీ పెంచాలని అడిగినా పట్టించుకోలేదని ఫైర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికల కోడ్​అమలవుతుందా? అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ​రావు ప్రశ్నించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ వాళ్లు ర్యాలీలు, ఆందోళనలు చేశారని.. కోడ్ అమల్లో ఉంటే వాటికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై సిద్దిపేట పోలీస్ ​కమిషనర్​కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, గతంలోనూ తాము కంప్లయింట్లు ఇచ్చినా స్పందించలేదని ఫైర్ అయ్యారు. సీపీ అధికార పార్టీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్​ కండువా ఉంటేనే పోలీసులు రక్షణ ఇస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం బీఆర్కే భవన్​లో సీఈవో వికాస్​రాజ్​ను రఘునందన్​రావు కలిశారు. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్​కమిషనర్​పై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డిపై దాడి విషయంలో సీపీ స్టేట్​మెంట్​తో తమ పార్టీ కార్యకర్తలపై బీఆర్ఎస్ ​నేతలు దాడులకు దిగుతున్నారని చెప్పారు. గత నెల 13న కూడా సిద్దిపేట పోలీసుల తీరుపై సీఈసీకి కంప్లయింట్ చేసినట్టు గుర్తు చేశారు.

చేసింది కాంగ్రెస్ అయితే.. మా మీద దాడులా?

‘‘ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై అటాక్​ చేసిన రాజు కాంగ్రెస్ కార్యకర్త అయితే, మా మీద ఎందుకు దాడులు చేస్తున్నారు” అని రఘునందన్ ప్రశ్నించారు. ఎలక్షన్ కోడ్ లో భాగంగా సెక్షన్ 30 యాక్ట్ కొందరికేనా? లేక అందరికా? స్పష్టత ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ‘‘బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ క్యాండిడేట్లకు భద్రత పెంచాలని ఆదేశాలు ఇచ్చారు. 2+2 నుంచి  4+4కు  సెక్యూరిటీ పెంచాలని అన్ని జిల్లాల ఎస్పీలకు అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ నుంచి ఆదేశాలు అందాయి. గతంలో నాకు సెక్యూరిటీ పెంచాలని డీజీపీని కలిస్తే పట్టించుకోలేదు. కేవలం అధికార పార్టీ నేతలకే సెక్యూరిటీ పెంచుతరా? ప్రతిపక్ష నేతలను పట్టించుకోరా” అని ప్రశ్నించారు.