అన్నదాతల అరిగోస .. 24 గంటల్లో రెండుసార్లు వర్షం

అన్నదాతల అరిగోస .. 24 గంటల్లో రెండుసార్లు వర్షం
  • పలు గ్రామాల్లో తడిసి ముద్దయిన ధాన్యం
  • కొనుగోలు కేంద్రాల్లో హమాలీ, లారీల సమస్య 
  • ధాన్యం కుప్పల వద్ద రైతుల పడిగాపులు 

ఈ ఫొటోలో ఉన్న  రైతు పేరు ద్యాగటి మహేందర్. 25 రోజుల కింద 60 క్వింటాళ్ల వడ్లను అమ్మడానికి వింజపల్లి  పీఏసీఎస్ సెంటర్ కు తెచ్చాడు. అప్పటి నుంచి వడ్లు కొనుగోలు చేయాలని సెంటర్ సిబ్బందిని అడిగితే రేపు మాపంటూ వాయిదా వేశారు. గత మూడు రోజుల్లో రెండుసార్లు వర్షం కురిసి వడ్లు తడిసిపోవడంతో వాటిని ఆరబెడుతూ సెంటర్ లోనే ఉంటున్నాడు. మరోవైపు వడ్లు రంగు మారుతున్నాయి. సిబ్బంది ధాన్యం ఎప్పుడు కొంటారో చెప్పడం లేదు. ఇది ఒక్క మహేందర్​పరిస్థితి మాత్రమే కాదు జిల్లాలోని చాలా మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. 

 సిద్దిపేట, వెలుగు: అన్నదాతలను అకాల వర్షం ఆగంజేస్తుంటే కొనుగోళ్లు చేయాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గన్నీ బ్యాగులు, హమాలీ, ట్రాన్స్ పోర్ట్ సమస్యలతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే రోజుల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు 24 గంటల్లో రెండుసార్లు కురిసిన అకాల వర్షంతో ధాన్యం తడిసిపోవడంతో రైతులు నానా తిప్పలు పడుతున్నారు. దాదాపు నెల రోజుల కింద  జిల్లాలో  కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా కొనుగోళ్లు మాత్రం స్లోగా జరుగుతున్నాయి. ప్రస్తుత యాసంగి సీజన్ లో జిల్లాలో 419 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

ఇప్పటి వరకు  24,446 మంది రైతుల నుంచి 1.13 లక్షల టన్నుల దొడ్డు రకం, 169 మంది రైతుల నుంచి 938 క్వింటాళ్ల సన్న వడ్లను కొనుగోలు చేశారు. నిబంధనల ప్రకారం జిల్లాలో కేవలం 45 బాయిల్డ్ రైస్ మిల్లర్లు మాత్రమే సెక్యురిటీ డిపాజిట్ చేయడంతో ఆయా మిల్లులకే కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేస్తున్నారు. కొనుగోళ్లు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా చాలా కేంద్రాల్లో సమస్యలు ఉన్నాయి. హమాలీ, ట్రాన్స్ పోర్ట్, గన్నీ బ్యాగుల సమస్య కారణంగా ధాన్యం గిడ్డంగులకు చేరడం లేదు. సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన అధికారులు స్పందించకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్నారు.

మహిళా రైతుల కష్టాలు 

సిద్దిపేట మార్కెట్ యార్డులో షెడ్లన్నీ నిండిపోగా ఆరుబయట రెండు వేల క్వింటాళ్ల ధాన్యం అమ్మకానికి పెట్టారు. రవాణా సమస్య కారణంగా వాటిని లిఫ్ట్ చేయక పోవడంతో అకాల వర్షానికి వడ్లన్నీ తడిసిపోయాయి. గత మూడు రోజులుగా మహిళా రైతులు ఇళ్లు వదిలి మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతూ అక్కడే ఉంటున్నారు. సిద్దిపేట మార్కెట్ యార్డుకు ప్రతి రోజు ఐదు లారీలు అవసరమవుతాయి కానీ రెండు కూడా రాకపోవడంతో ధాన్యం భారీగా పేరుకుపోతుంది. 

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో విసిగిపోయిన రైతులకు తరుగు పేరిట కట్టింగ్ లు కోలుకోకుండా చేస్తున్నాయి. పలు కేంద్రాల్లో బస్తాకు ఐదు కిలోల వరకు తరుగు పేరిట కట్టింగ్ లు చేస్తున్నా ప్రశ్నించే పరిస్థితుల్లో రైతులు లేరు. 
వర్షాల కారణంగా ధాన్యం తడవడంతో తేమ శాతం అధికంగా ఉందని నోరు మెదపడం లేదు. కొన్ని కేంద్రాల్లో సుతిలి పేరిట రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.

కొనుగోళ్ల లో తీవ్ర జాప్యం 

ఐదెకరాల్లో వరి పండించి 20  రోజుల కింద బండ చర్లపల్లి సెంటర్ కు ధాన్యం తెచ్చినా పలు కారణాలతో కొనలేదు. కుప్పల వద్దనే కాలం వెళ్లదీస్తుంటే అకాల వర్షం ఇబ్బందులకు గురిచేస్తోంది. పగలు ఆరబెడితే రాత్రి వర్షానికి తడిసి రంగు మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే వడ్లను కొనుగోలు చేయాలి. 

దేశెట్టి రమేశ్, రైతు, పుల్లూరు

సంచికి 5 కిలోలు కట్  

దుద్దెడ పీఎసీఎస్ సెంటర్ లో 250 బస్తాల ధాన్యం తెస్తే సమయానికి కొనకపోవడంతో వర్షానికి తడిసిపోయింది. ఇప్పుడేమో సంచికి ఐదు కిలోలు కట్ చేస్తామని అంటున్నారు. ఈ సమస్య ను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.

దేశెట్టి ఎల్లయ్య , కౌలు రైతు, దుద్దెడ