రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తవా ?: హరీశ్ రావు

రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తవా ?: హరీశ్ రావు

మెదక్, వెలుగు : ‘ఆగస్టు 15లోగా రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలు అమలుచేస్తే నేను రాజీనామాకు సిద్ధం.. నువ్వు సిద్ధమేనా ? రాజీనామా లేఖతో శుక్రవారం అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపం వద్దకు వస్తా.. నువ్వు నీ రిజైన్‌ లెటర్‌తో వస్తావా ?’ అని సిద్దిపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. మెదక్‌ బీఆర్‌ఎస్‌ క్యాండిడేట్‌ వెంకట్‌ రాంరెడ్డి నామినేషన్‌ సందర్భంగా గురువారం మెదక్‌లో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాందాస్‌ చౌరస్తాలో నిర్వహించిన సభలో హరీశ్‌రావు మాట్లాడారు. రుణమాఫీ, గ్యారంటీలు అమలు చేస్తే తన  రాజీనామాను స్పీకర్‌కు ఇస్తానని, చెయ్యకపోతే రేవంత్‌రెడ్డి రాజీనామాను గవర్నర్‌కు అందించాలన్నారు.

బీహెచ్‌ఈఎల్‌ ఇందిరా గాంధీ హయాంలో ఏర్పాటు అయిందని రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని, ఆయన స్క్రిప్ట్‌ రైటర్‌ సరిగా లేరని ఎద్దేవా చేశారు. దుబ్బాక నియోజకవర్గానికి ఏం చేశారని బీజేపీకి ఓట్లు వేయాలని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్, నర్సింగ్‌ కాలేజీ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ క్యాండిడేట్‌ రఘునందన్‌రావు మాటలు నమ్మితే నీళ్లు లేని బావిలో దూకినట్లే అవుతుందన్నారు. సభలో బీఆర్‌ఎస్‌ క్యాండిడేట్‌ వెంకట్‌ రాంరెడ్డి, దుబ్బాక, నర్సాపూర్, సంగారెడ్డి ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, చింత ప్రభాకర్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, యాదవ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత శేఖర్‌గౌడ్‌, మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్‌రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, మాణిక్యం, మల్లికార్జున్‌గౌడ్‌ పాల్గొన్నారు.