సిద్దిపేట ఆర్టీసీ డిపోలో కార్మికులకు అవమానం..డీఎంపై మంత్రి పొన్నం సీరియస్

సిద్దిపేట ఆర్టీసీ డిపోలో కార్మికులకు అవమానం..డీఎంపై మంత్రి పొన్నం సీరియస్

​సిద్దిపేట రూరల్, హుస్నాబాద్ వెలుగు: సిద్దిపేట ఆర్టీసీ డిపోలో తోటి కార్మికుడి సమస్యపై మాట్లాడేందుకు వెళ్లిన ఆర్టీసీ కార్మికులను డిపో మేనేజర్ నేలపై కూర్చోబెట్టి మాట్లాడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. డిపోలో డ్రైవర్ కం కండక్టర్‌‌‌‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ ఆరు నెలల కింద జరిగిన ప్రమాదం కారణంగా సస్పెన్షన్‌‌‌‌కు గురయ్యారు. సస్పెన్షన్ గడువు ముగియడంతో తిరిగి విధుల్లో చేరేందుకు వెళ్లగా, డిపో మేనేజర్ శ్రీనివాస్ రావు అతడిని విధుల్లోకి తీసుకునేది లేదని, ఉద్యోగం నుంచి తొలగిస్తానని హెచ్చరించినట్లు కార్మికులు ఆరోపించారు. దీంతో ఆర్టీసీ జేఏసీ నాయకులు డీఎంను కలిసి శ్రీనివాస్‌‌‌‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అయితే నిలబడి మాట్లాడాలని లేదా నేలపై కూర్చోవాలని డీఎం చెప్పడంతో కార్మికులు నేలపై కూర్చుని తమ సమస్యను చెప్పుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది.

డీఎం వ్యవహారశైలిపై మంత్రి ఆగ్రహం..

సిద్దిపేట డిపోలో జరిగిన ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. కార్మికుల పట్ల అమర్యాదగా వ్యవహరించే ఆఫీసర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఘటనపై ఆర్టీసీ ఎండీతో మాట్లాడి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్మికుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలను ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు.

ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవం ఇదేనా?
కార్మికులు నేలపై కూర్చోగా, డీఎం కుర్చీలో కూర్చున్న ఫొటోపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ కార్మికులను ఇంత చిన్నచూపు చూస్తారా? అంటూ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా ఫైర్​ అయ్యారు.