ట్రాఫిక్ నియంత్రణపై నజర్.. సిద్దిపేటలో పోలీస్, మున్సిపల్ ఉమ్మడి కార్యాచరణ

ట్రాఫిక్  నియంత్రణపై నజర్..  సిద్దిపేటలో పోలీస్, మున్సిపల్ ఉమ్మడి కార్యాచరణ
  • రోడ్ల ఆక్రమణల తొలగింపునకు చర్యలు
  • సోమవారం నుంచి క్షేత్ర స్థాయిలో చర్యలు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేటలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి అధికార యంత్రాంగం  చర్యలు ప్రారంభించింది. మున్సిపల్, ట్రాఫిక్ పోలీసులు కలిసి  సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే  రైతు బజార్, కూరగాయల మార్కెట్​లో వ్యాపారుల  ఆక్రమణలను నియంత్రించిన పోలీసులు పట్టణంలోని ప్రధాన రోడ్లపై దృష్టిపెట్టారు. రోడ్ల ఆక్రమణలను తొలగిస్తూనే ట్రాఫిక్  సమస్యను అధిగమించే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు.

 ఇప్పటికే  కొన్ని ఏరియాల్లో రోడ్ల ఆక్రమణల తొలగింపుతో సత్పలితాలు వస్తుండడంతో  పట్టణంలో పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయంపై వ్యాపారులకు అవగాహన కల్పించిన అధికారులు సోమవారం నుంచి ప్రత్యక్ష చర్యలతో పాటు  ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా రోడ్లను ఆక్రమించే వారిపై పోలీస్ ఆక్ట్ 39 బీ అమలు చేయడానికి రెడీ అవుతున్నారు.

మార్కెట్​ మార్కింగ్ పూర్తి

కూరగాయల మార్కెట్​లో ట్రాఫిక్ పోలీసులు ఆక్రమణల నియంత్రణ కోసం చర్యలు ప్రారంభించారు. పాత బస్టాండ్ నుంచి  రాంనగర్ చౌరస్తాకు  విజిటెబుల్ మార్కెట్ మీదుగా వాహనాలు ఎక్కువగా వెళ్తుంటాయి. ఈ మార్గంలో వ్యాపారులు రోడ్డును ఆక్రమిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు వైట్ లైన్ మార్కింగ్ చేసి దాని లోపలే కూరగాయలు విక్రయించాలని నిర్దేశించడంతో రోడ్డు విశాలంగా మారింది. రెండు రోజులుగా వైట్ లైన్ దాటి కూరగాయలు పెట్టుకోకుండా ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షిస్తుండడంతో వాహనదారులు పాదచారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

రెండు శాఖల సమన్వయంతో చర్యలు

సిద్దిపేట పట్టణంలో ప్రధాన రోడ్లపై ఆక్రమణలను తొలగించాలని మున్సిపల్, ట్రాఫిక్ పోలీసులునిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్, ట్రాఫిక్ ఎసీపీ సుమన్ కుమార్, సీఐ ప్రవీణ్​కుమార్  ఇటీవల సమావేశమయ్యారు. రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పట్టణంలో పలు ప్రధాన రోడ్లలో పాత  ఫ్లెక్సీలను, ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించడానికి సిద్ధమవుతున్నారు. రెండు శాఖల అధికారులు, సిబ్బంది  సమన్వయంతో  సోమవారం నుంచి క్షేత్ర స్థాయిలో చర్యలకు రెడీ అవుతున్నారు.  

ప్రధాన మార్గాలపై దృష్టి

సిద్దిపేట పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులున్న ప్రధాన మార్గాలపై అధికారులు ముందుగా దృష్టిపెడుతున్నారు. పట్టణంలోని  సుభాష్ రోడ్డు, మెయిన్ రోడ్డు, మెదక్ రోడ్డు, గాంధీ చౌక్, లాల్ కమాన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గాల్లో వ్యాపారులు ఆక్రమణలతో పాటు అడ్డదిడ్డంగా వాహనాలను పార్కింగ్ చేయడం ట్రాఫిక్ సమస్యకు కారణమవుతోంది. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నా ఇబ్బందులు తప్పడం లేదు.