- రూ.9కోట్లతో 30 ఎకరాల్లో నిర్మాణం
- 400 మందికి పైగా ఖైదీల సామర్థ్యం
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాకేంద్రం శివారులో హైసెక్యూరిటీతో జిల్లా జైలు నిర్మాణం పూర్తయింది. ఎన్సాన్ పల్లి జీపీ పరిధిలో 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.9కోట్లతో ఆధునిక సౌకర్యాలతో దీనిని నిర్మించారు. రెండేండ్ల కింద నిర్మాణ పనులు ప్రారంభం కాగా ఇటీవల పూర్తవడంతో ప్రారంభానికి సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆర్డీవో ఆఫీస్ పక్కనున్న జిల్లా జైలు అరకొర సౌకర్యాలతో ఖైదీలకు సరిపోవడం లేదు. ఈనేపథ్యంలో విశాలమైన స్థలంలో జైలు నిర్మించేందుకు నిర్ణయించారు.
ఆధునిక సౌకర్యాలతో జిల్లా జైలు
సిద్దిపేట జిల్లా కేంద్రంగా మారడం, పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు కావడంతోపాటు పోలీస్ స్టేషన్ల సంఖ్య పెరిగింది. ఈక్రమంలో ఖైదీలకు అనుగుణంగా సిద్దిపేట సబ్ జైలు లేకపోవడంతో 2018లో జైలు మంజూరైంది. జైలు నిబంధనల ప్రకారం ఐదు కిలోమీటర్ల పరిధిలో 100 పడకల హాస్పిటల్ ఉండాలనే నిబంధన నేపథ్యంలో ఎన్సాన్‌పల్లి శివారులో నిర్మాణ పనులను ప్రారంభించారు.
రూ.9కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా నిర్మిస్తున్న జిల్లా జైలు ఆధునిక సౌకర్యాలతో పాటు పటిష్ట నిఘా ఉండేలా రూపకల్పన చేశారు. సుమారు 400 మందికి పైగా ఉండేలా, భవిష్యత్‌లో ఈ సంఖ్య పెరిగినా ఇబ్బందులు కలగకుండా జైలును నిర్మించారు. దీనిలో పురుష, మహిళా ఖైదీల కోసం వేర్వేరుగా బారక్‌లు నిర్మించారు.
8 బారక్‌లతో జైలు
సిద్దిపేటలో జిల్లా జైలు 8 బారక్‌లతో హైసెక్యూరిటీతో ఈ జైలు నిర్మించారు. మొత్తం బారక్‌ల్లో మహిళలకు సపరేట్‌గా ఒకదానిని కేటాయించారు. దీనిలో 60 మంది మహిళా ఖైదీలు ఉండేదుకు వసతులు కల్పించారు. మిగిలిన ఏడు బారక్‌లు పురుష ఖైదీల కోసం నిర్మించగా.. వీటిలో దాదాపు 350 మందికి పైగా ఉండేలా ఏర్పాటు చేశారు.
జైలు చుట్టు 40 అడుగుల ఎత్తులో వాచ్ టవర్లను ఏర్పాటు చేసి రాత్రీ పగలు పహారా కాయనున్నారు. జైలులో ఖైదీలు అనారోగ్యం పాలైతే చికిత్స కోసం ప్రత్యేక బెడ్స్, లైబ్రరీ, ఖైదీల చేత పనులు చేయించేందుకు నాలుగు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ఖైదీలు పారిపోకుండా దాదాపు 7 మీటర్ల ఎత్తైన కాంపౌండ్, దానికి కరెంట్ ఫెన్సింగ్ వైర్ ఏర్పాటు చేశారు.
ఈ జైలులో డిప్యూటీ సూపరింటెండెంట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్‌తోపాటు 16 విభాగాలకు సంబంధించి 66 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. జైలు లోపల సిబ్బంది నివాసానికి క్వార్టర్స్‌ను నిర్మించారు.
22న సీఎం చేతుల మీదుగా ప్రారంభం
అధునాతన రీతిలో నిర్మించిన జిల్లా జైలును ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నర్మెట్ట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సీఎం పర్యటించనుండగా.. అదే రోజు జిల్లా జైలును ప్రారంభించనున్నారు. జిల్లా జైలు నిర్మాణం పూర్తి చేసుకుని దాదాపు ఆరు నెలలు కావస్తున్నా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వచ్చింది . ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా జైలును ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు.
