
- గాయపడినోళ్లకు వైద్య సాయం, పునరావాసం కల్పిస్తామని సిగాచి కంపెనీ ప్రకటన
- 3 నెలలు ప్లాంట్ క్లోజ్, పేలుడుకు రియాక్టర్ కారణం కాదని వెల్లడి
సంగారెడ్డి, వెలుగు: మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తామని సిగాచి కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ బుధవారం ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రమాదంలో 40 మంది కార్మికులు చనిపోగా, 33 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లిస్తాం. గాయపడినోళ్లకు పూర్తి స్థాయిలో వైద్యసాయం అందించడంతో పాటు పునరావాసం కల్పిస్తాం. ప్లాంట్‌ను మూడు నెలల పాటు క్లోజ్ చేస్తాం. ఘటనకు రియాక్టర్ పేలుడు కారణం కాదు.
దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నది. రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాం” అని అందులో పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తునకు సహకరిస్తామని కంపెనీ వైస్ చైర్మన్ చిదంబర్ నాథన్ చెప్పారు. 35 ఏండ్లుగా పరిశ్రమను నడుపుతున్నాం. ఎప్పుడూ ప్రమాదం జరగలేదు. కంపెనీని పదేండ్ల కింద ఎలాంగో గౌడాకు లీజుకు ఇచ్చాం. ప్లాంట్ బాధ్యతలు ఆయనే చూస్తున్నారు. ఈ ప్రమాదంలో అతను కూడా చనిపోయాడు” అని తెలిపారు. కార్మికుల సంఖ్య విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, పొంతన లేని సమాధానాలు వస్తున్నాయన్నారు.