మెడికల్ బోర్డు ఎప్పుడో..? సింగరేణి కార్మికుల్లో నెలకొన్న ఆందోళన

మెడికల్ బోర్డు ఎప్పుడో..? సింగరేణి కార్మికుల్లో నెలకొన్న ఆందోళన
  • నాలుగు నెలలుగా నిర్వహించని బోర్డు  
  • వారసుల ఏజ్ అయిపోతుందంటూ కార్మికుల్లో బెంగ 
  • ఆందోళనలకు సిద్ధమవుతున్న కార్మిక సంఘాలు


భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో నాలుగు నెలలుగా మెడికల్​బోర్డు నిలిచిపోవడంతో కార్మికుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు తమ వారసుల ఏజ్​అయిపోతుందనే బెంగ పట్టుకుంది.  బోర్డు ఎప్పుడు  నిర్వహిస్తారోనని వేలాది మంది కార్మికులు ఎదురు చూస్తున్నారు.  రెగ్యులర్​గా ​బోర్డు నిర్వహించాలనే డిమాండ్ తో కార్మిక సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. సింగరేణిలో కారుణ్య నియామకాల(డిపెండెంట్​ఎంప్లాయ్ మెంట్​) కింద కార్మికుల వారసులకు ఉద్యోగాలను మెడికల్ సర్టిఫికెట్ ద్వారానే కల్పిస్తుంది.  

ఒక్కసారి బోర్డు ఏర్పాటు చేస్తే..

2018 నుంచి మెడికల్ బోర్డును ప్రారంభించగా.. ఇప్పటివరకు 118 బోర్డులు నిర్వహించారు. ఇందులో దాదాపు13,500 మంది కార్మికుల వారసులకు డిపెండెంట్​ఎంప్లాయ్ మెంట్​కింద జాబ్ లు కల్పించారు. గతంలోనైతే ప్రతి నెలకోసారి బోర్డు నిర్వహించేది. ఏదేని కారణాలతో ఏర్పాటు చేయకుంటే ఆ తర్వాత నెలలో రెండు బోర్డులను ఏర్పాటు చేసేది. ఒక్కసారి బోర్డు ఏర్పాటు చేస్తే..  150 మంది నుంచి 200 మంది కార్మికులను మేనేజ్ మెంట్ పిలుస్తుంది. ఇందులో 75 మంది నుంచి120 మందికి పైగా అన్​ఫిట్​అవుతుండడం సర్వసాధారణం.  కాగా నాలుగు నెలలుగా బోర్డు నిర్వహించకపో వడంతో పాటు యాజమాన్యం కూడా స్పష్టత ఇవ్వకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వారసుల ఏజ్ అయిపోతుందనే బెంగలో ఉన్నారు. 40 ఏండ్లు దాటితే వారసులకు అన్​ఫిట్​ద్వారా జాబ్ లు దక్కవని పేర్కొంటున్నారు. 

అన్​ఫిట్​చేసేందుకు రూ. లక్షల్లో వసూలు

 మెడికల్​బోర్డు అవినీతిమయంగా మారిందనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడే కార్మికులు ఇక తాము పని చేయలేమని, వారసులకు డిపెండెంట్ జాబ్ లు కల్పించాలని మెడికల్​బోర్డుకు దరఖాస్తు పెట్టుకుంటారు. రెండేండ్ల సర్వీస్​ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్​ఆస్పత్రిలో మెడికల్​బోర్డు ఇంటర్వ్యూలు, హెల్త్​చెకప్​జరుగుతుంటాయి.  బోర్డులో సింగరేణి ఆస్పత్రి డాక్టర్లతో పాటు బయటి డాక్టర్లు, కొందరు ఆఫీసర్లు, యూనియన్ల లీడర్లు, దళారులు అన్​ఫిట్​చేయిస్తామంటూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్టు, ఒక్కొక్కరి వద్ద  రూ. 6 లక్షల నుంచి రూ. 8ల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉంటున్నాయి.  

బోర్డు ప్రక్షాళనపై డైరెక్టర్ ఫోకస్  

దశాబ్దాకాలం తర్వాత  ఐఏఎస్ ఆఫీసర్ ను సింగరేణి డైరెక్టర్​ పర్సనల్ ​అండ్​వెల్ఫేర్(పా) పోస్టులో ప్రభుత్వం నియమించింది.  ఇటీవల ఐఏఎస్ గౌతమ్ పొట్రు బాధ్యతలు తీసుకున్నారు.  మెడికల్​బోర్టుపై దృష్టి పెట్టి పెట్టారు.  చీఫ్ ​మెడికల్​ఆఫీసర్​ద్వారా వివరాలు తెలుసుకుని.. అక్రమ వసూళ్ల ఆరోపణలపైనా విచారించారు. పారదర్శకతతో కూడిన బోర్డు నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. ఇటీవలి పెండింగ్​లోని రెఫరల్ కేసులకు బోర్డు నిర్వహించి 54 మందిని పిలిచారు. వీరిలో ఐదుగురుని మాత్రమే అన్​ఫిట్​చేశారు. ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా ఈ ప్రక్రియ  పూర్తి చేశారు. ఇంత తక్కువగా అన్ ఫిట్ చేయడంతో కార్మికుల్లో కొంత ఆందోళన నెలకొంది. 

దళారులకు చెక్ పడేనా..

 గత మార్చిలో అప్పటి సింగరేణి సీఎంఓపై సింగరేణి విజిలెన్స్​అధికారులు విచారణ చేపట్టారు. ఆ తర్వాత నుంచే మెడికల్​బోర్డు నిర్వహణను సింగరేణి ఆపేసింది. కొందరు యూనియన్​లీడర్లు, అధికారులు దళారులతో అక్రమ దందా చేస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి వచ్చే స్పెషలిస్ట్​డాక్టర్ల వివరాలను ముందే తెలుసుకొని దళారులు బేరసారాలు సాగించిన దాఖలాలున్నాయి. మరోవైపు బోర్డుపై ఏసీబీ, సీఐడీ ఆఫీసర్లతో పాటు విజిలెన్స్​నిఘా ఉందంటూ అన్​ఫిట్​కావాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాలంటూ దళారులు కొత్తగా దందాకు తెరతీయడం గమనార్హం. ఇకముందు  2 నుంచి 3 ఏండ్ల సర్వీస్​ ఉన్న వారిలో దరఖాస్తు చేసుకున్న కార్మికులకే బోర్డు నిర్వహించి, అన్​ఫిట్​చేసి దశలవారీగా కారుణ్య నియామకాలు కల్పిస్తే బోర్డులో అవినీతిని అరికట్టే అవకాశాలు ఉన్నాయి. 

త్వరలో​ బోర్డు నిర్వహిస్తాం

త్వరలో మెడికల్​బోర్డును నిర్వహిస్తాం. పారదర్శకతతో పాటు అర్హులైన వారికే అన్​ఫిట్​సర్టిఫికెట్ ఉంటుందనేది కార్మికులు గుర్తుంచుకోవాలి.  మేనేజ్ మెంట్ నుంచి ఆదేశాలు రాగానే మెడికల్​బోర్డును నిర్వహిస్తాం. దళారుల మాటలను నమ్మి కార్మికులు మోసపోవద్దు. 

- కిరణ్​రాజ్ కుమార్​, సీఎంఓ, సింగరేణి-