కోహెడ, వెలుగు : సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మండలంలోని ఆరేపల్లి గ్రామ పరిధిలోని చంద్రనాయక్ తండా సమీపంలో మోయతుమ్మెద వాగు పరిసరాల్లో కట్టేసిన మూడు ఆవులపై పులి దాడి చేసి చంపేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెందిన మాలోతు రమేశ్ తన మూడు ఆవులు, రెండు దూడలను శనివారం మోయతుమ్మెద వాగు పరిసరాల్లో కట్టేశాడు. ఆదివారం తెల్లవారుజామున వెళ్లి చూసే సరికి ఆవులు కనిపించలేదు.
దీంతో చుట్టుపక్కల గాలించగా.. ఓ ఆవు చనిపోయి కనిపించింది. మరికొంత ముందుకు వెళ్లే సరికి చెట్ల పొదల నుంచి శబ్దం రావడంతో రైతు భయపడి వెనుదిరిగి వచ్చి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. అందరూ కలిసి ఘటనాస్థలానికి వెళ్లి చూడగా.. మరో రెండు ఆవులు చనిపోయి కనిపించగా.. రెండు దూడలు కనిపించలేదు. వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. పోలీస్, ఫారెస్ట్ ఆఫీసర్లు ఘటనాస్థలానికి చేరుకొని పాదముద్రల ఆధారంగా పులే చంపినట్లు నిర్ధారించారు. డ్రోన్ సాయంతో గాలించినా పుడి జాడ దొరకకపోవడంతో బోనును ఏర్పాటు చేశారు. పశువులను వేటాడిన ప్రాంతానికి పులి మళ్లీ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని ఆఫీసర్లు సూచించారు. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
