
మన దేశంలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. భారతదేశంలోని ప్రధాన పండుగల్లో అహోయి అష్టమి ఒకటి. ఈ పండుగ ఆశ్వయుజమాసం కృష్ణపక్షంలోని అష్టమి తిథి నాడు అక్టోబర్ 13న జరుపుకుంటారు. ఆ రోజు తమ పిల్లల కోసం తల్లులు ఉపవాసం ఉంటారు. అహోయ్ అష్టమి పూజా ముహూర్తం, ప్రాముఖ్యత తదితర విషయాలు తెలుసుకుందాం.
అహోయి అష్టమి నాడు ( అక్టోబర్ 13) తల్లులు రోజంతా నిష్టగా ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసాన్ని ప్రత్యేకించి తమ పిల్లల శ్రేయస్సు, ఆనందం కోసమే ఉంటారు. ఈ ఉపవాసం ద్వారా తమ పిల్లలు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారని నమ్ముతారు.
అహోయ్ అష్టమి ఎప్పుడు?
ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి నాడే అహోయ్ అష్టమి జరుపుకుంటారు. ఈ రోజున పార్వతిదేవిని పూజిస్తారు. ఈ తిథి ఈ ఏడాది అక్టోబరు 13, 2025 మధ్యాహ్నం 12:24 గంటలకు ప్రారంభమై..అక్టోబర్ 14 ఉదయం 11:09 గంటలకు ముగుస్తుంది. నక్షత్రాలు ఉండే సమయంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కాబట్టి అక్టోబర్ 13న సాయంత్రం 5:53 రాత్రి 07:08 గంటల మధ్య పూజ చేసుకోవడానికి అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు.
ఉపవాసం ఎలా ఆచరించాలి?
అహోయ్ అష్టమి నాడు, తల్లులు తమ కొడుకుల దీర్ఘాయుష్షు కోసం తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. సాయంత్రం ఆకాశంలో నక్షత్రాలను చూసిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. కొంతమంది మహిళలు చంద్రుడిని చూసిన తర్వాత ఉపవాసం ముగిస్తారు. ఈ వ్రతాన్నే అహోయ్ తిథే అని కూడా అంటారు.
అహోయ్ అష్టమి వ్రత విధానం
- అహోయ్ అష్టమి నాడు తెల్లవారుజామునే లేచి తలస్నాన మాచరించి.. ఉపవాస దీక్షకు పూనుకోవాలి.
- తర్వాత గంగాజలంతో కాని.. నదీ జలాలతో కాని.. పసుపు నీళ్లతో ఇంటి పూజా గదిని శుభ్రం చేయాలి.
- పీఠంపై అహోయ్ మాత (పార్వతిదేవి) ఫోటోను పెట్టాలి.
- పువ్వులు, ధూపం కర్రలు, ఆవు నెయ్యి, పవిత్ర దారం, గోధుమ పిండి, పొడి ఆవు పాలు, మేకప్ కిట్ మరియు కర్వాతో నిండిన కుండ అమ్మవారికి సమర్పించాలి.
- పూజ చేస్తూ.. అమ్మవారి వ్రత కథను చదవాలి.
- చివరగా హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచాలి.
- పూజ ముగిసిన తర్వాత స్త్రీలు తమ మెడలో వెండితో తయారు చేసిన సాహు లాకెట్ లేదా పసుపుకొమ్మును ధరించడం శుభప్రదంగా భావిస్తారు.
- ఈ పూజ చేయడం వలన వారి పిల్లలకు దీర్ఘాయుష్షు లభిస్తుందని నమ్ముతారు.
పురాణ కథ
ఒక గ్రామంలో.. ఒక వడ్డీ వ్యాపారికి ఏడుగురు కొడుకులు ఉండేవారు. ఒకరోజు ఈ వ్యాపారీ భార్య ఇంటి గోడలను కట్టడానికి మట్టిని తీసుకురావడానికి వెళుతుంది. అయితే మట్టిని పారతో తొవ్వుతుండగా.. పొరపాటున ఆ పార ఓ చిన్నారిపై పడుతుంది. దీంతో ఆ చిన్నారి అక్కడిక్కడే చనిపోతుంది. నా చేతులతో నేనే చంపానని ఆ వడ్డీ వ్యాపారి భార్య ఎంతో ఏడుస్తుంది. బాధపడుతూనే ఆమె ఇంటికి వస్తుంది. అయితే కొంతకాలం తర్వాత ఆమె ఏడుగురు కొడుకుల్లో ఒకరు జబ్బు బారిన పడి కొన్ని రోజులకే చనిపోతాడు. ఆ తర్వాత ఒక్కొక్కరు ఆరుగురు కొడుకులు కూడా అలాగే చనిపోతారు. నేను చేసిన ఆపాపం వల్లే నా కొడుకులు ఇలా చనిపోయారని ఆ తల్లి రోధిస్తుంది.
విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ఆడవారు నీ పశ్చాతాపం వల్ల నీ పాపాలు సగం పోయాయి. ఇప్పుడు నువ్వు అష్టమి నాడు ఉపవాసం ఉండి అహోయి మాతను పూజించమని చెప్తారు. ఆమె అలాగే అహోయి అష్టమి నాడు ఉపవాసం ఉండి.. దేవతను పూజిస్తుంది. ఈ పూజను మెచ్చిన అహోయి దేవత మళ్లీ తన కొడుకులను తిరిగి బతతికిస్తుంది. అందుకే ప్రతి ఏడాది పిల్లల సుఖ సంతోషాలు, ఆనందం, దీర్ఘాయుష్షు కోసం ఈ రోజున ఉపవాసం ఉంటారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఆధ్యాత్మిక గ్రంథాల నుంచి సేకరించిన సమాచారంతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు.