
శ్రావణమాసం .. ఆగస్టు 23 ... పోలాల అమావాస్యతో ముగిసింది. ఈ రోజు నుంచి అంటే ఆగస్టు 24 నుంచి ఈ ఏడాది ( 2025) బాధ్రపదమాసం ప్రారంభమైంది. భాద్రపదం అనగానే అందరికీ గుర్తొచ్చేది వినాయకచవితి పర్వదినమే. కాని వరాహజయంతి, వామనజననం, రుషిపంచమి, ఉండ్రాళ్ల తద్దె, పితృదేవతలకు ఉత్తమగతులు కల్పించే మహాలయ పక్షం.ఇలా మాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే చివరి 15 రోజుల్లో పితృదేవతలను పూజించాలి. ఈ నెలలో ఏఏ పండుగలు ఎ ప్పుడు .. మహిళలు చేయాల్సి వ్రతాల గురించి తెలుసుకుందాం. .
బాధ్రపదమాసం ఇటు దేవతా పూజలకు.. అటు పితృదేవతలను కూడా పూజించే నెల. వినాయకచవితి..రాధాష్టమి.. ఉండ్రాళ్ల తద్దె.. వామన జయంతి.. ఇలా అనేక రకాల పుణ్యతిథులున్నాయి. ఇక పితృదేవతలు భూమిపై చివరి 15 రోజుల పాటు సంచరిస్తారని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఓ పక్కా దేవతా పూజలకు మరో పక్క పితృదేవతలను కూడా ఈ మాసంలోనే పూజిస్తారు.
తెలుగు నెలల్లో భాద్రపద మాసం ఆరవనెల . ఈ మాసంలోని పూర్ణిమ తిథినాడు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం సమీపంలోగాని, ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలోగానీ ఉండడంవల్ల ఈ మాసానికి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. భాద్రపద మాసం వర్షఋతువులో రెండో మాసం.భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో అంటే మొదటి 15 రోజులు దేవతలను పూజిస్తారు. తరువాత 15 రోజులు అనగా కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెబుతున్నాయి.
విష్ణుమూర్తి .. దశావతారాలలో మూడవ అవతారమైన శ్రీ వరాహ అవతారాన్ని... ఐదవదైన శ్రీ వామనావతారాన్ని భాద్రపద మాసంలోనే శ్రీమన్నారాయణుడు ధరించి దుష్టశిక్షణ గావించాడు.అందుకే ఈ మాసంలో ‘దశావతార వ్రతం’ చెయాలనే శాస్త్రాల్లో ఉందని పండితులు చెబుతున్నారు. భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మను పూజించేందుకు చాలా మంచి రోజు . ఆ రోజు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతున్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ రోజునే రాధాష్టమి అంటారు. ఆ రోజున రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.
భాధ్రపద మాసంలో స్త్రీలు చేయాల్సిన వ్రతాలు
హరితాళిక వ్రతం , సువర్ణగౌరీ వ్రతం ( ఆగస్టు 26) : భాద్రపద శుక్ల పక్ష తదియనాడు ‘హరితాళిక వ్రతం’ లేదా ‘సువర్ణ గౌరీ వ్రతం’ ‘పదహారు కుడుముల తద్ది’ ఆచరిస్తారు. శివపార్వతులను పూజించి, పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ పూజను కన్యలు పాటించడంవల్ల వారికి మంచి భర్త లభిస్తాడు. ముత్తయిదువలు పాటించడంవల్ల వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుంది.
శుక్ల చవితి : వినాయక చవితి ( ఆగస్టు 27) : ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినంను వినాయక చవితి .... లేదా గణేశ చతుర్ధి.... పర్వదినంగా జరుపుకుంటారు. ఆనాడు వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించి స్వామివారికి పూజ చేసి గరికతో పాటు, 21 పత్రాలతో పూజించి , వ్రతకథ చెప్పుకుని, ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించవలెను. ఈ పండుగను వాడవాడలా ఘనంగా తొమ్మిది రాత్రుళ్లు జరుపుకుంటారు.
శుక్ల ఏకాదశి : పరివర్తన ఏకాదశి( సెప్టెంబర్ 3) : తొలి ఏకాదశినాడు క్షీరాబ్దిపై శేషతల్పంమీద శయనించిన శ్రీమహావిష్ణువు ఆ రోజున ప్రక్కకు పొర్లుతాడు అంటే పరివర్తన చెందుతాడు . అందకే ఈ ఏకాదశిని పరివర్తన ఏకాదశి... .విష్ణు పరివర్తన ఏకాదశి అని ... పద్మ పరివర్తన ఏకాదశి అని అంటారు. ఆరోజు ఏకాదశి వ్రతం ఆచరించడంవల్ల కరువుకాటకాలు రావని, వచ్చి వుంటే విముక్తి లభిస్తుంది.
శుక్ల ద్వాదశి : వామన జయంతి : దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని శ్రీమహావిష్ణువు ఆరోజు ధరించినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆరోజు విష్ణుమూర్తి స్వరూపమైన వామనుడిని పూజించి, వివిధ నైవేద్యములు సమర్పించి, పెరుగును దానం చేయాలని పండితులు చెబుతున్నారు.
శుక్ల చతుర్దశి : అనంత చతుర్ధశి ( సెప్టెంబర్ 6) : అనంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. శ్రీమహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతమునకే అనంత చతుర్దశి వ్రతం... లేదా .... అనంత పద్మనాభ వ్రతం... అని అంటారు. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలోఉందని రుషిపుంగవులు తెలిపారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
ఉండ్రాళ్ళ తద్ది ( సెప్టెంబర్ 10) : భాద్రపద బహుళ తదియ నాడు అవివాహితలు చేసే వ్రతం . తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి దేవతాపూజ చేసి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి సాయంత్రం ఊయలలో వూగుతారు.
కృష్ణ పక్ష ఏకాదశి : అజ ఏకాదశి ( సెప్టెంబర్ 17): అజ ఏకాదశినే ‘ధర్మప్రభ ఏకాదశి’ అని కూడా అంటారు. పూర్వం గౌతమ మహర్షి చెప్పిన ఈ వ్రతం చేసి రాజ్యాన్ని, భార్యాకుమారులను పోగొట్టుకుని కాటికాపరిగా పని చేసిన హరిశ్చంద్రుడు వాటిని తిరిగి పొందినట్లు పురాణాల్లో ఉంది. బాధ్రపదమాసం కృష్ణ పక్ష ఏకాదశి నాడు వ్రతం ఆచరించడంతోపాటు నూనెగింజలు దానం చేయాలని పండితులు అంటున్నారు.
మహాలయపక్షాలు.. పితృదేవతలను పూజించే రోజులు
బాధ్రపద మాసంలో చివరి 15 రోజులను( సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు) మహాలయ పక్షం అంటారు. ఈరోజుల్లో పితృ దేవతలను పూజిస్తారు. పంచాంగం ప్రకారం ఏ తిథి రోజు మరణిస్తే ఆరోజు పితృ దేవతలకు పిండ ప్రదానం చేయాలి. అమావాస్య రోజున ఏడు తరాల పితృ దేవతలను శాస్త్ర ప్రకారంగా పూజించాలి.
బాధ్రపదమాసం చివరి 15 రోజులు మహాలయ పక్షాలు కాబట్టి ఆ రోజుల్లో శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షంలో పదిహేనురోజులపాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధులను నిర్వహించడం, పిండప్రదానం చేయడం ఆచరించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ రకమైన విధులను నిర్వహించడంవల్ల గయలో శ్రాద్ధ విధులను నిర్వహించినంత ఫలం లభిస్తుంది.