కార్తీకమాసం కొనసాగుతుంది. హిందువులు ఉదయం.. సాయంత్రం ఇంట్లో తులసికోట దగ్గర.. గుమ్మాల దగ్గర .. దేవుడి మందిరం దగ్గర దీపారాధన చేస్తారు. దేవుడి దగ్గర .. తులసికోట దగ్గర నిత్యం చేసినా.. కార్తీకమాసంలో మాత్రం గుమ్మాల దగ్గర అటు పక్క.. ఇటు పక్క దీపాలు పెడతారు.
కార్తీక మాసంలో వెలిగించే దీపాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు. మనసును వెలిగించేది.. నిండు సంతోషాన్ని కలిగించేది. మంచి గుణాలను ఇచ్చేదిగా దీపాన్ని చూస్తారు. దీపం వెలిగించడం అంటే, మనిషిలో ఉన్న అన్ని చెడు గుణాలను చెదరగొట్టి, జ్ఞానం అనే మంచి స్వభావాన్ని నింపుకున్నట్లేనని పెద్దలు చెప్తారు.
పంచభూతాల్లో అగ్నికి విశిష్టమైన స్థానం ఉంది. వేదాల్లో అగ్ని గురించి, మనుషులు చేసే యజ్ఞ ఫలాన్ని దేవతలకు తీసు కెళ్లే వాహికగా అగ్నిని వర్ణించారు. ప్రాణికోటి తేజస్సుకు కారణం అగ్నే. అలాంటి అగ్ని కొలువుదీరే దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించకూడదు. అగరువత్తితో మొదటి దీపాన్ని వెలిగించాలి. ఆ తరువాత ఒక దీపంతో మిగిలిన దీపాన్ని వెలిగించాలి. కనీసం రెండు వత్తులు లేకుండా దీ పారాధన చేయకూడదని పండితులు చెబుతున్నారు.
ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె దీపారాధనకు వాడితే మంచిదని భక్తుల నమ్మకం. అలాగే దీపారాధనకు వాడే నూనెను బట్టి ఫలితాలు ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి. ఆవునెయ్యి లోరెండు వేపనూనే చుక్కలు వేసి దీపం వెలిగిస్తే విజయం లభిస్తుంది. కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగిస్తే దంపతులు అన్యోన్యంగా ఉంటారు. నవ్వుల నూనె దేవతలందరికీ ఇష్ట మైనది. దీపపు ప్రమిదలో శివుడు.. వెలుగులో సరస్వతి..లక్ష్మీదేవి కొలువై ఉంటారని పురాణాల ద్వారా తెలుస్తుంది.
-వెలుగు,లైఫ్-
