
హిందూ పంచాగం ప్రకారం.. బాధ్రపదమాసం కొనసాగుతుంది. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి.. ప్రతి ఏకాదశికి చాలా విశిష్టత ఉంది. బాధ్రపదమాసం శుక్ష పక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. ఈ ఏడాది ( 2025) సెప్టెంబర్ 3 బుధవారం రోజున పరివర్తన ఏకాదశి వచ్చింది. ఆరోజు విశిష్టత ఏంటి.. ఆరోజు ఏంచేయాలి.. ఏం చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శేష శయ్యపై యోగ నిద్రలోకి వెళ్లిన శ్రీమహావిష్ణువు....భాద్రపద శుద్ధ ఏకాదశి ( సెప్టెంబర్ 3) రోజున ఎడమ వైపు నుంచి కుడి వైపుకి ఒత్తిగిల్లుతాడట. అలా స్వామి ఒక వైపు నుంచి మరో వైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కనుక, దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు.
పరివర్తిని ఏకాదశి సెప్టెంబర్ 3 న జరుపుకుంటారు. ఈ ఏకాదశి తిథి సెప్టెంబర్ 3న తెల్లవారుజామున 03:53 గంటలకు ప్రారంభమై... సెప్టెంబర్ 4 ఉదయం 04:21 గంటలకు ముగుస్తుంది. పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను పూజించి ... ఉపవాసదీక్షను పాటిస్తే జీవితంలో ఆనందం.. ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు. పరివర్తన ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తే... పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి.
పూజావిధానం..
- ఉదయాన్నే స్నానం చేసి శుబ్రమైన బట్టలు ధరించాలి.. మడి బట్టలు ధరిస్తే చాలా మంచిది.
- పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్టించుకోవాలి. పూజామందిరంలో విష్ణుమూర్తి ఫొటో ఉంటే ప్రత్యేకంగా అవసరం లేదు.
- విష్ణుమూర్తికి పచ్చని పూలతో ..పూల దండ సమర్పించాలి.
- సంకల్పం చెప్పుకొని కోరికలు తీరాలని.. భక్తితో పూజ చేయాలి. విష్ణు సహస్రనామం పఠించాలి.. లేదా.. వినాలి.
- పూజలో కచ్చితంగా తులసి దళాలు ఉండాలి.
- ధూపం.. దీపం.. నైవేద్యం సమర్పించాలి. పచ్చని పండ్లను స్వామివారికి సమర్పించాలి.
- ఉపవాస దీక్షను పాటించాలి. విష్ణువుకు సంబంధించిన మంత్రాలను జపించాలి.
- కృష్ణావతారంలో ఉన్న శ్రీమహావిష్ణువుకు వెన్న, కలకండ (పటిక బెల్లం) నైవేద్యంగా పెట్టడం వల్ల .. అన్ని కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు.
- విష్ణువుతోపాటు లక్ష్మీదేవి, వినాయకుడిని పూజిస్తే అదృష్టం కలసివస్తుంది.
- నిరుపేదలకు పసుపు రంగు వస్త్రాలను దానం చేస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి.
- ఓం వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీ తవ
పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ” - అంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని యధాశక్తి పూజించడం వలన, అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని చెబుతున్నారు.
పరివర్తన ఏకాదశికి మన ప్రకృతి లో వచ్చే మార్పులకు సంబదించినదిగా కూడా పరిగణిస్తారు. కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు. ఈ రోజునే శ్రీ మహా విష్ణువు వామనావతారాన్ని ఎత్తి మహాబలిని పాతాళ లోకానికి పంపిస్తాడని వేదాలు చెబుతున్నాయి. పరివర్తన ఏకాదశి రోజు వామన అవతరాన్ని పూజించడం వలన.. ఉపవాసం ఉండటం వలన బ్రహ్మ -విష్ణు -మహేశ్వరులని సేవిస్తే .. ఎంతటి ఫలితం ఉంటుందో అంతటి ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.