
శ్రావణమాసం రేపటితో ( ఆగస్టు 23) ముగియనుంది. ఆగస్టు 23 ... శ్రావణమాసం అమావాస్య.. దీనినే సంతాన అమావాస్య.. పోలాల అమావాస్య అంటారు. పురాణాల ప్రకారం ఈ శ్రావణ అమావాస్య ప్రాముఖ్యత ఏమిటి... సంతాన అమావాస్య అని ఎందుకంటారు. సంతాన సౌభాగ్య వ్రతాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం.
హిందూ పురాణాల ప్రకారం మహిళలకు అనేక వ్రతాలు.. పూజలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో అనేక వ్రతాలు ఉన్నాయి. శ్రావణ అమావాస్య రోజు ( ఆగస్టు 23) సంతానం కోసం.. పోలాల అమావాస్య వ్రతం చేస్తారు.
పురాణాల ప్రకారం పోలాల అమావాస్యకు ఎంతో విశి ష్టత వుంది. ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంర క్షణ కోసం నిర్దేశించబడింది. పెళ్లైన చాలా కాలానికి కూడా సంతానం కలుగని స్త్రీలకు పోలాల అమావాస్య ఎంత ముఖ్యమో… సంతానవంతులైన స్త్రీలకు కూడా అంతే ముఖ్యం. అందుకే స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తారు.
వ్రత విధానం
శ్రావణమాస అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసి… దేవుడి మందిరంలో ముగ్గులు వేసుకోవా లి. ముఖ్యంగా ఈ పూజకు ఉండాల్సింది కంద మొక్క. దేవుడి మందిరం వద్ద కంద మొక్కను ఉంచి దాని చుట్టూ పసుపు, కుంకుమ, బియ్యం పిండితో చుక్కలు పెట్టా లి. ఏడు పోచలు దారానికి పసుపు రాసి పసుపుకొమ్ము కట్టాలి. ఇలా ఇంట్లో ఎంత మంది మహిళలు వుంటే అన్ని అమ్మవారికి ఒకటి, వాయనం ఇచ్చే ముత్తైదువుకి ఒకటి చొప్పున తోరాలు తయారుచేసుకొని కంద మొక్క దగ్గర పెట్టాలి. మొదటగా పసుపు వినాయకుడిని పూజించి ఆ తర్వాత కంద మొక్కలోకి మంగళగౌరీదేవిని గానీ, సంతానలక్ష్మీదేవిని గానీ ఆవాహనం చేసుకొని షోడశోపచారాలతో శక్తి కొలది పూజచేయాలి.
పూజ పూర్తి అయిన తర్వాత ఏడు బూరెలు (మగపిల్లలు కలవారు... మగసంతానం కావాలనుకునేవారు)... ఏడు గారెలు (ఆడపిల్లలు ఉన్నవారు, ఆడ సంతానం కావాలనుకునేవారు) నైవేద్యం పెట్టాలి. కథ చెప్పుకుని అక్షింతలు వేసు కోవాలి. ఏడు బూరెలు, ఏడు గారెలు దక్షిణ వేసి బహు సంతానవతి అయిన ముత్తై దువుకి వాయనం ఇచ్చి, పసుపుకొమ్ము కట్టిన తోరాన్ని ఇచ్చి నమస్కరించి అక్షింత లు వేయించుకోవాలి. ఒక పసుపుకొమ్ము తోరాన్ని అమ్మవారికి వుంచి, మిగిలినవి తీసి పూజ చేసుకున్నవారు మెడలో వేసుకోవాలి. పిల్లలకు కూడా కథ అక్షింతలు వేసి పసుపు కొమ్ము కట్టిన తోరాన్ని మెడలో వేయాలి. ఇలాచేస్తే మంచి జరుగుతుం దని, సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పదికాలాలపాటు చల్లగా ఉంటారు. నమ్మకం. సాయంత్రం కూడా అమ్మవారి వద్ద దీపం వెలిగించాలి. పూర్ణం బూరె లు, గారెలు లాగే పోలేరమ్మకు పొట్టెక్క బుట్టలు నైవేద్యం పెట్టవచ్చు. పనస ఆకు లతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.