ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశి లోకి మారడాన్ని సంక్రమణం అంటారు. సంక్రమణం అంటే మార్పు. మనకి రాశులు 12. ( మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల,వృశ్చిక, , ధనుస్సు, మకర, కుంభ, మీన) సూర్యుడు ఒక్కో మాసంలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. అల సంవత్సరంలో 12 సంక్రాంతులు వస్తాయి.
సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశి లోకి మారిన సమయమే మకర సంక్రాంతి. ఈ రోజు నుంచి ( 2026 జనవరి 15) ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అవుతుంది. భూమధ్య రేఖకి ఉత్తరదిక్కుగా సూర్యుడు ప్రయాణం చేయడాన్ని ఉత్తరాయణం అంటారు. సూర్యుడు ఒక్కో రాసిలో ప్రవేశించినపుడు ఆ రాశి పేరుతో సంక్రమణం అంటారు. కానీ అన్నిటి కన్నా మకర రాశి లో ప్రవేశించిన మకర సంక్రమణం మనకు ఎంతో ముఖ్యమైనది.
ALSO READ : సంక్రాంతి పండుగ.. గాలి పటాల పండుగ.. మొదటి కైట్ ఎప్పుడు .. ఎవరు ఎగరేశారు..!
ఈ కాలంలో ప్రకృతి సంపద పంటలు, ముఖ్యంగా ఆహార పంటలు చేతికి అంది వస్తాయి. చేమంతి, బంతి పూల పంటతో తోటలు కళకళ లాడతాయి. హేమంత గాలులతో, ఎటు చూసినా ప్రకృతి వింత శోభతో అలరారుతుంది.
ఏడాది పొడవునా కష్టపడి పెంచిన పంట, ధాన్యం చేతికి వస్తుంది కాబట్టి రైతులు కూడా ఆనందోత్సాహాలతో ఉంటారు. ఈ మాసంలో పొలం పనులు ఏవి ఉండవు కాబట్టిఇంటి దగ్గర అందరు తీరికగా ఉంటారు. ఇంతకు ముందు మాసాలైన ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం మాసాలలో పెళ్లి ముహుర్తాలు ఉంటాయి, కాబట్టి కొత్తగా పెళ్లి అయిన కూతుర్లు, అల్లుళ్ళు, ఇంటికి వస్తారు కాబట్టి ఇల్లంతా సందడిగా ఉంటుంది. పండుగ జరుపుకోవటానికి ఇంత కన్నా మంచి సమయం ఏమి ఉంటుంది?
ALSO READ : భోగాలకు దక్షిణాయనం.. పుణ్యకర్మలకు ఉత్తరాయణం.. తాంత్రికవేత్తల వివరణ ఇదే..!
మకర రాశిలో విష్ణు నక్షత్రం అయిన శ్రవణా నక్షత్రం రోజున శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభ స్వామిగా సాక్షాత్కరించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మకర రాశిని విష్ణు రాశి అంటారు. వామనావతారంలో స్వామి బ్రహ్మండమంతా రెండు అడుగులతో కొలిచి, మూడవ పాదంతో బలిని పాతాళానికి పంపినది ఉత్తరాయణ పుణ్యకాలం లోనే.... దేవతలకు ముఖ్యమైన ఈ రోజులలో చేసే పుణ్య కార్యాలు, దాన ధర్మాలు, పూజలు ఉత్తమ ఫలితాకలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ఉత్తరాయణం లో చేయవలసినవి ముఖ్యంగా, నదీస్నానం, సూర్య నమస్కారం, వేదాధ్యయనం, నూతన గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహం, వంటి పుణ్య కార్యాలు. ఉత్తరాయణం ఉండే ఆరు నెలలలో పవిత్ర నదులైనటువంటి గంగ, గోదావరి వంటి నది స్నానం చేసి, నువ్వులు, బియ్యం, వస్త్రాలు, దుంపలు, ఫలాలు, చెరకు, విసనకర్ర, బంగారం, గోవులు వంటివి దానం చేస్తే ఉత్తమ గతులు పొందుతారు అని శాస్త్రం ద్వారా తెలుస్తుంది. గుమ్మడి కాయను దానం చేస్తే సాక్షాత్తు బ్రహ్మాండాన్నే దానం చేసిన ఫలం పొందుతారు.
సంక్రాంతి పర్వదినాన సూర్యుడు మకర రాశి అధిపతి, తన కుమారుడు అయిన శనీశ్చరుని ఇంట ప్రవేశిస్తాడు. పురాణాల ప్రకారం శని... సూర్యుడు ఇరువురూ బద్ధ విరోధులు... అయినా మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుడు విధిగా తన కుమారుడు శనితో సమావేశమవుతాడు. ఒక నెల రోజులు కొడుకు ఇంటనే గడుపుతాడు. ఈ విధంగా ఈ పర్వదినం తండ్రీ కొడుకుల అనుబంధానికి కూడా ఒక సంకేతం అని చెబుతారు.
ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలుగా.... - దక్షిణాయనం రాత్రిగా భావించడంతో... దేవతలు పగలులో సంక్రమించే మకర సంక్రాంతిని ఒక మహాపర్వదినంగా భావస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలాన్ని దేవమానంగా, దక్షిణాయనాన్ని పితృయానంగా భావించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
ఇక సంక్రాంతి పర్వదినంలోనే శ్రీహరి రాక్షసుల్ని సంహ రించి వారి తలలు నరికి మందర పర్వతం కింద పాతిపెట్టి, దేవతలకు సుఖశాంతు లు ప్రసాదించాడనీ అందుకే ఈ పండుగని అశుభాల్లోంచి శుభాల్లోకి ప్రవేశించే సింహద్వారంగా భావించి పవిత్రంగా ఈ పండుగని జరుపుకుంటారు.
సంక్రాంతి పర్వదినం నాడే భగీరధుడు 6 లక్షల 60 వేల మందికీ పరమ పవిత్ర గంగాజలంతో తర్పణలు అర్పించి వాళ్ళని శాపవిముక్తుల్ని చేసాడని ప్రతీతి. భగీరథుని కోరిక ప్రకారం పూర్వజుల శాప విముక్తికి గంగా భవాని పాతాళ లోకంలో ప్రవేశించి చివరికి సముద్రంలో కలుస్తుంది. ఏటా మకర సంక్రాంతి పర్వదినాన గంగానది పాతాళలోకంలో ప్రవేశించి చివరికి బంగాళా ఖాతంలో కలుస్తుంది. మకర సంక్రాంతి పర్వదినాన గంగానది బంగాళా ఖాతంలో కలసిన పవిత్ర సమయంలో లక్షలాది భక్తులు గంగా నదిలో తమ పితృదేవతలకి తర్పణలిస్తారు.
