రాఘవ్ చద్దా సంచలన పోస్ట్: "నన్ను సైలెంట్ గా ఉంచగలరేమో కానీ.. ఓడించలేరు"

రాఘవ్ చద్దా సంచలన పోస్ట్: "నన్ను సైలెంట్ గా ఉంచగలరేమో కానీ.. ఓడించలేరు"

ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతగా.. అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రాఘవ్ చద్దాను పార్టీ ఒక్కసారిగా రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తప్పించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కేవలం పదవి నుంచి తొలగించడమే కాకుండా.. పార్టీకి కేటాయించే సమయంలో ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ రాయడం ఇప్పుడు విస్మయానికి గురిచేస్తోంది. దీనిపై స్పందించిన చద్దా.. సోషల్ మీడియాలో ఒక పవర్‌ఫుల్ వీడియోను షేర్ చేస్తూ.. "నన్ను నిశ్శబ్దంగా ఉంచగలరేమో కానీ.. ఓడించలేరు" అంటూ సవాల్ విసిరారు.

ఆ వీడియోలో రాఘవ్ చద్దా వేసిన ప్రశ్నలు ఇప్పుడు పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. పార్లమెంటులో సామాన్యుల గొంతుకగా మారడమే నేను చేసిన తప్పా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం, డేటా ఎక్స్‌పైరీ సమస్యలు, విమానాశ్రయాల్లో అదనపు లగేజీ ఛార్జీలు, తండ్రులకు పితృత్వ సెలవుల హక్కు వంటి ప్రజా సమస్యలపై ఆయన గళమెత్తారు. "నా ప్రసంగాల వల్ల సామాన్యులకు మేలు జరిగింది, కానీ పార్టీకి జరిగిన నష్టం ఏంటి? నన్ను మాట్లాడకుండా ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు?" అంటూ తన అసంతృప్తిని వెల్లడించారు చద్దా.

పంజాబ్, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయకేతనం ఎగురవేయడంలో కీలక పాత్ర పోషించిన యువ ఎంపీని ఇలా పక్కన పెట్టడం వెనుక అసలు కారణమేంటనే చర్చ మొదలైంది. రాఘవ్ చద్దా స్థానంలో పంజాబ్‌కే చెందిన అశోక్ మిట్టల్‌ను డిప్యూటీ లీడర్‌గా ఆప్ ప్రతిపాదించింది. అయితే చద్దా తన ప్రసంగాల్లో అడిగే ప్రశ్నలు పార్టీకి ఇబ్బందిగా మారాయా? లేక పార్టీ అంతర్గత సమీకరణాలు మారాయా? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఏదేమైనా తనను సైలెంట్ చేయలేరంటూ చద్దా ఇచ్చిన రియాక్షన్ చూస్తుంటే.. ఆప్ కోటలో ఏదో పెద్ద యుద్ధమే జరుగుతోందని అర్థమౌతోంది.నాయకత్వం ఆయన గొంతు నొక్కాలని చూస్తున్నా.. ప్రజల తరపున తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.