సాధారణ చికిత్సతో కూడా 75% కడుపు క్యాన్సర్ కేసులను నివారించొచ్చు: వైద్యుల వెల్లడి

సాధారణ చికిత్సతో కూడా 75% కడుపు క్యాన్సర్ కేసులను నివారించొచ్చు: వైద్యుల వెల్లడి

వైద్య నిపుణులు ఒక కొత్త విషయాన్నీ కనిపెట్టారు. ఒక సాధారణ చికిత్స ద్వారా 75% కడుపు క్యాన్సర్ కేసులను నివారించవచ్చని  చెబుతున్నారు. నేచర్ మెడిసిన్ జర్నల్‌లో వచ్చిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, 50 ఏళ్లలోపు వారిలో ప్రపంచవ్యాప్తంగా కడుపు క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వెల్లడించింది. దీనికి అసలు కారణం హెలికోబాక్టర్ పైలోరీ (H. pylori) అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అని గుర్తించారు. ఈ బ్యాక్టీరియా ఎక్కువ కాలం కడుపులో ఉంటే, అది కడుపు క్యాన్సర్‌కు కారణమవుతుంది. అయితే మంచి ఏమిటంటే ఈ ఇన్ఫెక్షన్‌ను యాంటీబయాటిక్స్,  కొన్ని మందులతో నయం చేయవచ్చు.

ప్రస్తుతం ఉన్న నివారణ పద్ధతులు మారకపోతే 2008 నుండి 2017 మధ్య జన్మించిన వారిలో ప్రపంచవ్యాప్తంగా 1 కోటి 50 లక్షల  కొత్త కడుపు క్యాన్సర్ కేసులు నమోదవుతాయని WHOలోని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) పరిశోధకులు అంచనా వేశారు.

అయితే ఈ అధ్యయనం ప్రకారం ఈ కేసులలో 76%  అంటే దాదాపు మూడు వంతులకి H. pylori కారణం ఇంకా దీనిని మందులతో  నివారించవచ్చు. ఆసియాలో అత్యధికంగా కోటికి పైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత అమెరికా, ఆఫ్రికా ఉన్నాయని అంచనా. పరిశోధకులు వయస్సు, మరణాలకి గల కారణాలు, జనాభా పెరుగుదల  ఆధారంగా క్యాన్సర్ ప్రమాదాన్ని అంచనా వేయడానికి పెద్ద ఎత్తున పరిశోధనలు చేశారు.

H. pyloriని గుర్తించి చికిత్స చేసే కార్యక్రమం 100% ప్రభావవంతంగా ఉంటే, కడుపు క్యాన్సర్ కేసులను 75% వరకు తగ్గించవచ్చు. కనీసం 80-90%  కార్యక్రమాలు కూడా 60-68% కేసులను నివారించగలవు. ఇలాంటి కార్యక్రమాలు ఖర్చుతో కూడుకున్నవి అయినాసరే తక్కువ ఆదాయం ఉన్న ప్రాంతాలలో కూడా వీటిని అమలు చేయవచ్చు. HPV లేదా హెపటైటిస్ B టీకా కార్యక్రమాలతో వీటిని పోల్చవచ్చు.
ఈ అధ్యయనం H.pyloriని గుర్తించి చికిత్స చేసే కార్యక్రమాలలో పెట్టుబడులు పెట్టడం, H. pylori వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమని చెబుతుంది. కొన్ని పరిమితులు ఉన్నాగాని  ఈ పరిశోధన భవిష్యత్తులో కడుపు క్యాన్సర్‌లను మరింతగా తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టంగా సూచిస్తుంది.