మళ్లీ ఆ ఇద్దరే.. వింబుల్డన్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో తలపడనున్న సినర్‌‌‌‌, అల్కరాజ్‌‌

మళ్లీ ఆ ఇద్దరే.. వింబుల్డన్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో తలపడనున్న సినర్‌‌‌‌, అల్కరాజ్‌‌

లండన్‌‌‌‌‌‌‌‌: ఫ్రెంచ్ ఓపెన్‌‌ ఫైనల్లో ఐదున్నర గంటలు పోరాడి రికార్డు సృష్టించిన వరల్డ్ నంబర్‌‌‌‌ 1, 2 ప్లేయర్లు యానిక్ సినర్‌‌‌‌, కార్లోస్ అల్కరాజ్ మరో మెగా టైటిల్‌‌ ఫైట్‌‌కు రెడీ అయ్యారు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్‌‌ టోర్నీలో ఫైనల్‌‌ కు దూసుకెళ్లారు. రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌‌ స్లామ్‌‌పై కన్నేసిన సెర్బియా లెజెండ్ నొవాక్ జొకోవిచ్ మళ్లీ సెమీస్‌‌ లోనే వెనుదిరిగాడు. అతనికి చెక్ పెట్టి సినర్ తొలిసారి ఆల్ ఇంగ్లండ్ ఫైనల్ చేరగా.. రెండుసార్లు డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌‌‌‌‌.. వరుసగా మూడోసారి ఆఖరాటకు వచ్చాడు. శుక్రవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌లో రెండోసీడ్‌‌‌‌‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ 6–4, 5–7, 6–3, 7–6 (8/6)తో ఐదో సీడ్‌‌‌‌‌‌‌‌ టేలర్‌‌‌‌‌‌‌‌ ఫ్రిట్జ్‌‌‌‌‌‌‌‌ (అమెరికా)పై గెలిచాడు. 

గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్స్‌‌‌‌‌‌‌‌లో అల్కరాజ్‌‌‌‌‌‌‌‌కు ఇది వరుసగా 24వ విజయం కావడం విశేషం. 2023, 2024లో జొకోవిచ్‌‌‌‌‌‌‌‌పై నెగ్గిన అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ స్లామ్‌‌‌‌‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌లో 5–0 రికార్డుతో ఉన్నాడు. నెల కిందట యానిక్‌‌‌‌‌‌‌‌ సినర్‌‌‌‌‌‌‌‌తో జరిగిన ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో రెండు సెట్లు వెనకబడినా అద్భుతంగా పుంజుకుని చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. 2 గంటలా 49 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లో సూపర్‌‌‌‌‌‌‌‌గా ఆడిన అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ రెండో సెట్‌‌‌‌‌‌‌‌లో తడబడ్డాడు. వెంటనే పుంజుకున్న అతను తర్వాతి రెండు సెట్లలో తన ట్రేడ్‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌‌‌‌‌ ఆటతో ఆకట్టుకున్నాడు. 

ఓ దశలో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను ఐదో సెట్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లడానికి ఫ్రిట్జ్‌‌‌‌‌‌‌‌కు రెండుసార్లు చాన్స్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. కానీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నాలుగో సెట్‌‌‌‌‌‌‌‌ టైబ్రేక్‌‌‌‌‌‌‌‌లో 6–4 ఆధిక్యంలో ఉన్న దశలో వరుసగా పాయింట్లు కోల్పోయాడు.  మ్యాచ్‌‌‌‌‌‌‌‌ మొత్తంలో 13 ఏస్‌‌‌‌‌‌‌‌లు, 3 డబుల్‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌‌‌‌‌ చేసిన అల్కరాజ్‌‌‌‌‌‌‌‌.. ఏడు బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో మూడింటిని సద్వినియోగం చేసుకున్నాడు. 25 అనవసర తప్పిదాలు చేసిన కార్లోస్‌‌‌‌‌‌‌‌ 38 విన్నర్స్‌‌‌‌‌‌‌‌ కొట్టాడు. 

19 ఏస్‌‌‌‌‌‌‌‌లు, 6 డబుల్‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌‌‌‌‌, ఒక్క బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ కాచుకున్న ఫ్రిట్జ్‌‌‌‌‌‌‌‌ 24 అన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌, 44 విన్నర్లు సాధించాడు. అయితే అల్కరాజ్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే కేవలం 10 పాయింట్లు వెనకబడి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను చేజార్చుకున్నాడు. మరో మ్యాచ్ లో టాప్‌‌ సీడ్‌‌ యానిక్‌‌ సినర్‌‌ (ఇటలీ) 6–3, 6–3, 6–4తో జొకోవిచ్‌‌ను ఓడించాడు. బలమైన సర్వీస్‌‌లు, బ్యాక్‌‌ హ్యాండ్‌‌ షాట్లతో రెచ్చిపోయిన సినర్‌‌ రెండు గంటల్లోనే జొకోకు చెక్‌‌ పెట్టాడు. మ్యాచ్ మొత్తంలో బ్రేక్‌‌ పాయింట్లు సాధించడంలో విఫలమైన జొకో 27 విన్నర్లు, 12 ఏస్‌‌లు కొట్టాడు. 12 ఏస్‌‌లు, రెండు డబుల్‌‌ ఫాల్ట్స్‌‌ చేసిన సినర్‌‌ 36 విన్నర్లతో మ్యాచ్‌‌ను ముగించాడు. అదివారం జరిగే ఫైనల్లో అల్కరాజ్ తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.