సింగపూర్: ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్.. సింగపూర్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు 21–9, 21–12తో రైకో గుంజి (జపాన్)పై గెలిచింది. బలమైన స్మాష్‌లు, ర్యాలీలతో చెలరేగిన తెలుగమ్మాయి 37 నిమిషాల్లోనే ప్రత్యర్థికి చెక్ పెట్టింది. తొలి గేమ్‌లో 3–3తో స్కోరు సమమైన తర్వాత సింధు ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు.
రెండో గేమ్‌లో 7–7 తర్వాత వరుస పాయింట్లతో హోరెత్తించింది. మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్ 2–0 స్కోరుతో ఉన్నప్పుడు కున్లావుత్ విదిత్సార్న్ (థాయ్‌లాండ్)పై రిటైర్డ్‌హర్ట్ అయ్యాడు. దాంతో లక్ష్యకు వాకోవర్ విజయం లభించింది. మరో మ్యాచ్‌లో హెచ్. ఎస్. ప్రణయ్ 18–21, 21–16, 15–21తో లోహ్ కీన్ యి (సింగపూర్) చేతిలో ఓడాడు. మెన్స్ డబుల్స్‌లో నాలుగోసీడ్ సాత్విక్–చిరాగ్ షెట్టి 21–15, 11–21, 21–18తో లీ జి హుయ్–యాంగ్ పో సుయాన్ (చైనీస్‌తైపీ)పై గెలిచారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తానీషా క్రాస్టో 8–21, 21–17, 21–16తో యుటా వాట్నాబే–మయా తగుచి (జపాన్)పై నెగ్గారు.
