జకార్తా: ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లో సింధు 25–23, 21–16తో థాయిలాండ్ క్రీడాకారిణి బుసానన్‌పై విజయం సాధించింది. తదుపరి రౌండ్‌లో ఆమె ప్రపంచ నంబర్ వన్ అన్ సే-యంగ్‌తో తలపడే అవకాశం ఉంది.
పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. మాజీ ప్రపంచ నంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్ 19–21, 15–21తో జపాన్‌కు చెందిన యుషి తనకా చేతిలో ఓడిపోయాడు. మరో స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ సైతం 19–21, 16–21 తో ఇండోనేషియా ఆటగాడు అల్వి ఫర్హాన్ చేతిలో పరాజయం పాలై మొదటి రౌండ్‌లోనే వెనుదిరిగాడు.
మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ కూడా ఏడో సీడ్ పోర్న్‌పావీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లో హరిహరన్ అంసకరుణన్, ఎమ్.ఆర్. అర్జున్ జోడీ 21–18, 21–10 తో మలేషియా జంటపై గెలిచి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. అయితే మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్ జంట, మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ తొలి రౌండ్‌లోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు.
