- సింగరేణి డైరెక్టర్ ఎల్వీ సూర్యనారాయణ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బహుముఖ విస్తరణ దిశగా సింగరేణి వడివడిగా అడుగులు వేస్తోందని సింగరేణి కాలరీస్ కంపెనీ డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వీ సూర్యనారాయణ పేర్కొన్నారు. సింగరేణి డే సెలబ్రేషన్స్‌లో భాగంగా మంగళవారం కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్ లో సింగరేణి జెండాను ఆయన ఎగురవేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వళన చేసి వేడుకలను ప్రారంభించారు.
సింగరేణి ఆవిర్భావం సందర్భంగా డైరెక్టర్లు కె. వెంకటేశ్వర్లు, ఎం. తిరుమల రావుతో కలిసి కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2030 నాటికి వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. కోల్ ఇండియా పదేండ్లలో రెట్టింపు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. కొత్త మైన్స్ కోసం సింగరేణి ఇక నుంచి వేలంలో పాల్గొంటుందన్నారు.
మణుగూరు డీప్‌సైడ్ ఓసీ కోసం టెండర్లు వేసిందని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పోటీని తట్టుకొనేలా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటూ నాణ్యతతో కూడిన బొగ్గును వినియోగదారులకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. బొగ్గుతో పాటు కీలక ఖనిజాల వైపు సింగరేణి దృష్టి పెట్టిందని తెలిపారు. గోల్డ్, కాపర్ మైన్స్ కోసం కృషి చేస్తున్నామన్నారు.
2047 విజన్ డాక్యుమెంట్‌తో సింగరేణి ముందుకు సాగుతోందన్నారు. కార్మిక సంక్షేమానికి యాజమాన్యం పెద్ద పీట వేస్తోందని చెప్పారు. అనంతరం ఉత్తమ ఆఫీసర్‌గా ఎంపికైన బి. శ్రీనివాస రావు, ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన కె. వెంకటేశ్వర ప్రసాద్, డీవీవీ నాగేంద్ర ప్రసాద్‌ను సన్మానించారు. ఈ ప్రోగ్రాంలో జీఎం వెల్ఫేర్ జీవీ. కిరణ్ కుమార్, సీఎంఓఏఐ ప్రెసిడెంట్ టి. లక్ష్మీపతిగౌడ్, ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్‌తో పాటు పలువురు ఆఫీసర్లు పాల్గొన్నారు.
సాదాసీదాగా..
ఈసారి సింగరేణి డే సెలబ్రేషన్స్ యాజమాన్యం సాదాసీదాగా నిర్వహించింది. సింగరేణి హెడ్డాఫీస్అయిన కొత్తగూడెంతో పాటు అన్ని ఏరియాల్లో సెలబ్రేషన్స్‌ను పెద్ద ఎత్తున యాజమాన్యం గత కొన్నేండ్లుగా నిర్వహిస్తోంది. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంతో పాటు అన్ని ఏరియాల్లోని సింగరేణి గ్రౌండ్స్‌ల్లో సాయంత్రం టైంలో ఆటా పాటలతో గ్రాండ్‌గా చేసే వారు. ఈ సారి సెలబ్రేషన్స్ ఆఫీసులకే పరిమితమయ్యాయి.
