లాక్ డౌన్ ముగిసినంక సింగరేణి ఎన్నికలు

లాక్ డౌన్ ముగిసినంక సింగరేణి ఎన్నికలు

మందమర్రి, వెలుగు: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. ప్రస్తుత గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్  కాలపరిమితి ఏప్రిల్  నెలతో ముగిసింది. దీంతో తిరిగి ఎన్నికలను లాక్ డౌన్  ఎత్తివేసిన తర్వాత నిర్వహించే అవకాశాలున్నాయి. తాజాగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన యూనియన్ల వివరాలను సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ(సీఎల్ సీ) నుంచి కార్మికశాఖ ప్రాంతీయ కమిషనర్ (ఆర్ఎల్ సీ)కు ఆదేశాలు జారీ అయ్యాయి. కొంతకాలంగా సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ తో ఆందోళన కార్యక్రమాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే  కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ,  సీఎల్ సీపై జాతీయ కార్మిక సంఘాలు ఒత్తిడి తీసుకువచ్చాయి. తాజాగా  గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలని హెచ్ఎంఎస్  నాయకులు కేంద్ర కార్మికశాఖకు రాసిన లేఖపై సీఎల్ సీ ఆఫీసర్లు స్పందించి యూనియన్ల వివరాల సేకరణలో పడ్డారు.

నాలుగు కాదు.. రెండేళ్లే..

సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ఏప్రిల్​తో ముగిసింది. 2017 అక్టోబర్  5న సంఘం ఎన్నికలు  నిర్వహించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) గెలుపొందింది. ఈ మేరకు 2019 అక్టోబర్ 5 నాటికి రెండేళ్ల కాలపరిమితి పూర్తయింది.  2017లో నాలుగేళ్ల కాలపరిమితికే ఎన్నికల నిర్వహణకు అన్ని సంఘాలు ఆమోదం తెలిపాయి. అయితే కేంద్ర కార్మికశాఖ మాత్రం రెండేళ్ల కాలపరిమితితో టీబీజీకేఎస్ యూనియన్ కు అధికార పత్రం అందించింది. రెండేళ్ల కాలపరిమితి ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని టీబీజీకేఎస్  మినహా అన్ని యూనియన్లు పట్టుబట్టాయి. అయితే ఎన్నికల నిర్వహణ సందర్భంగా నాలుగేళ్ల కాలపరిమితిపై  నిర్ణయం తీసుకున్నారని టీబీజీకేఎస్ వాదించింది. కేంద్ర కార్మిక శాఖ అందించిన అధికార పత్రంలో  రెండేళ్ల కాలపరిమితిగా పేర్కొనడంతో టీబీజీకేఎస్  కంగుతింది. దీంతో  తాము ఎన్నికల్లో గెలిచిన ఆరునెలల తర్వాత  2018 మార్చిలో అధికార ధృవీకరణ పత్రం తీసుకున్నామని, 2020 ఏప్రిల్  వరకు గుర్తింపు సంఘంగా కొనసాగే వీలుందని నాయకులు పేర్కొన్నారు. ఈ గడువు కాస్తా ఏప్రిల్ తో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలని యూనియన్లు పట్టుబడుతున్నాయి.

ఏడాది కావస్తున్నా ఎకరాకు నీళ్లు రాలే!