
- సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌గా ఆరు ఏరియాల్లోని హాస్పిటల్స్
- స్కూళ్ల ఆధునీకరణతోపాటు సీబీఎస్ఈ సిలబస్
- పాత క్వార్టర్ల స్థానంలో మోడ్రన్ క్వార్టర్స్
- కొత్త ప్రపోజల్స్ సిద్ధం
హైదరాబాద్, వెలుగు : సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టింది. వెల్ఫేర్‌లో భాగంగా కార్మికులకు, వారి కుటుంబాలకు విద్య, వైద్యం, వసతుల కల్పనపై ప్రధానంగా ఫోకస్ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కార్మికుల శ్రేయస్సు కోసం కొత్త ప్రపోజల్స్ సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే ప్రమాదంలో గాయపడిన, మృతిచెందిన కార్మికులను, వారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ.కోటి ప్రత్యేక బీమా సదుపాయాన్ని కల్పించగా మరిన్ని సౌలతులు కల్పించేందుకు రెడీ అవుతున్నది.
ఇక అన్ని సింగరేణి స్కూళ్లలో సీబీఎస్ఈ
కార్మికుల పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూ డిన చదువులు అందించాలని కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో కార్మికుల పిల్లల కోసం నిర్వహిస్తున్న స్కూళ్లను ఆధునీకరించాలని నిర్ణయించింది. ఢిల్లీలో గవర్నమెంట్స్కూళ్ల తరహాలో సింగరేణి సూళ్లను డిజిటలీకరణ చేయాలని సంకల్పించారు. అదే విధంగా ఇప్పటి వరకు కొనసాగుతున్న స్టేట్ సిలబస్ స్థానంలో సీబీఎస్ఈ సిలబస్‌కు అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాలేజీలను, ఇంజినీరింగ్ కాలేజీలను ఆధునీకరించాలని యోచిస్తున్నారు.
మోడ్రన్ క్వార్టర్స్‌గా అభివృద్ధి..
దశాబ్ధాల కాలంగా ఉన్న కార్మికుల పాత క్వార్టర్స్అన్నింటినీ ఆధునీకరించాలని సింగరేణి యాజమాన్యం యోచిస్తోంది. ఇప్పటివరకు ఆఫీసర్లకు మాత్రమే మోడ్రన్ క్వార్టర్స్ సదుపాయం కల్పించగా, ఇక నుంచి కార్మికుల క్వార్టర్స్‌ను కూడా అప్‌గ్రేడ్ చేయాలని అనుకుంటోంది. సింగరేణి ఆరు ఏరియాల పరిధిలో ఇప్పటివరకు 42వేలకు పైగా కార్మికులున్నారు. ఈ కార్మిక కుటుంబాలు చాలా వరకు పాత క్వార్టర్స్‌లోనే ఉంటున్నాయి.
.కొన్ని చోట్ల క్వార్టర్ల నిర్వహణ సరిగ్గా లేక పాములు వస్తున్నాయి. వానాకాలం సీజన్లో అయితే కార్మికులు చాలా తిప్పలు పడుతున్నారు. వీటిని అధిగమించి కార్మికుల రిస్థితిని మెరుగుపర్చాలని యాజమాన్యం నిర్ణయించింది. పాత క్వార్టర్స్ తొలగించి వాటి స్థానంలో మోడ్రన్ డిజైన్‌తో నిర్మించాలని నిశ్చయించింది. సంస్కరణల్లో భాగంగా కొత్త పంథాలో ముందుకు సాగాలని సింగరేణి యోచిస్తోంది. కొత్త సీఎండీ సారథ్యంలో సింగరేణి సంస్కరణలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.
సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్స్‌గా అప్‌గ్రేడ్..
సింగరేణిలోని ఆరు ఏరియాల్లోని హాస్పిటల్స్‌ను సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్స్‌గా తీర్చిదిద్దాలని సింగరేణి భావిస్తోంది. ఇప్పటి వరకు కొనసాగుతున్న కొత్తగూడెం, రామగండంతో పాటు పలు ఏరియాల్లోని హాస్పిటల్స్‌ను అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తోంది. ఇంతవరకు సింగరేణి దవాఖానల్లో సాధారణ వైద్యమే చేస్తుండగా..అత్యాధునిక వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌తో పాటు, ప్రైవేటు కార్పొరేట్హాస్పిటల్స్కు పంపేవారు. అయితే, ఇక నుంచి పూర్తిస్థాయిలో గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, ఆర్థోపెడిక్తదితర స్పెషలైజేషన్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చి సూపర్‌స్పెషాలిటీ సేవలు అందించనున్నారు.