గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తనంటూ.. నిరుద్యోగులకు 4 కోట్లు టోకరా

గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తనంటూ.. నిరుద్యోగులకు 4 కోట్లు టోకరా
  •     మరో ముగ్గురు నిందితులూ పోలీసుల అదుపులోకి 
  •     సింగరేణిలో, ఇతర శాఖల్లో జాబ్స్ ఇప్పిస్తనంటూ వల
  •     ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్లు చేయిస్తనని కూడా వసూళ్లు
  •     మొత్తం రూ. 15 కోట్ల నుంచి 20 కోట్లు దోచేశాడని అనుమానాలు 

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో జాబ్స్ ఇప్పిస్తానని, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల్లో చేర్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి రూ. 4.49 కోట్ల మేరకు వసూలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితోపాటు మరో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. సింగరేణి సీఎండీ తనకు బాగా తెలుసని.. సెక్రటేరియెట్ లో పరిచయస్తులు ఉన్నారని.. విద్యుత్ శాఖలో డీఈని అంటూ నిరుద్యోగులను నమ్మిస్తూ అతను మోసం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ దందా కోసం వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను సైతం అతను నియమించుకున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 60 మంది వద్ద నుంచి దాదాపు రూ. 4.49 కోట్ల మేరకు ఉద్యోగాల పేరిట వసూళ్లు చేశాడని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్లు చేయిస్తామని వారి నుంచీ డబ్బులు దండుకున్నారని చెప్పారు. ఈ దందాకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేసినట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీసులు మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్నాడని వరంగల్ జిల్లా రంగసాయిపేటకు చెందిన దాసు హరి కిషన్ పై కంప్లయింట్ రావడంతో అతడి కోసం వెతికామని, చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీకి చెందిన గుండా వినోద్ (సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి) ఇంట్లో ఉన్నట్టు తెలుసుకుని అరెస్ట్ చేశామన్నారు. ఈ వ్యవహారంలో వినోద్ తోపాటు హైదరాబాద్ కు చెందిన మెడికల్ స్టూడెంట్ దాసు హర్ష, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చిరుమర్తి సంజయ్ ని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. త్వరలో మరికొందరిని కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు. 
 
 జాబ్స్, ట్రాన్స్ ఫర్ల పేరుతో వల 

 

ఉద్యోగాలు, ట్రాన్స్ ఫర్ల పేరుతో మూడు నాలుగేండ్లుగా హరికిషన్ ఈ దందా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 2022లో సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ సందర్భంగా పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయంటూ ప్రచారం సాగింది. ఇదే అదనుగా భావించిన హరికిషన్ తన ఏజెంట్ల ద్వారా చక్రం తిప్పాడు. కొత్తగూడెం, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, రామగుండం ప్రాంతాల్లో జూనియర్ అసిస్టెంట్​ఎగ్జామ్​రాసిన 30 మంది నిరుద్యోగులకు వల వేశాడు. సింగరేణి భవన్ లో పని చేస్తున్నానని, అప్పటి సీఎండీ శ్రీధర్ బాగా తెలుసంటూ వారిని నమ్మించాడు. ఒక్కొక్కరి నుంచి రూ. 18 లక్షలకు డీల్ కుదుర్చుకుని.. అడ్వాన్స్ గా రూ. 5 లక్షల చొప్పున తీసుకున్నాడు. ఇలాగే మరో 10 మంది నుంచి రూ. 10 లక్షల చొప్పున గుంజాడు. ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 10 నుంచి రూ. 20 లక్షలకు ఒప్పందాలు చేసుకున్నాడు. 

సెక్రటేరియెట్ లో తనకు తెలిసినవారు అని ఫోన్లలో మాట్లాడిస్తూ మోసం చేసేవాడు. ఏపీకి చెందిన నిరుద్యోగులను కూడా ఉద్యోగాల పేరిట చీట్ చేశాడు. మొత్తంగా మూడేండ్లలో రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల దాకా నిరుద్యోగుల నుంచి ఇతను వసూళ్లు చేసినట్టు అనుమానిస్తున్నారు. అయితే, ఏండ్లు గడుస్తున్నా సింగరేణిలో ఉద్యోగాలు రాకపోవడంతో బాధిత నిరుద్యోగులు హరికిషన్ పై చుంచుపల్లి పోలీసులకు కంప్లయింట్ చేయగా.. నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. కాగా, హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, భూకబ్జాల దందాల్లోనూ హరికిషన్ ఉన్నాడని, అతడికి కొందరు పోలీస్ ఆఫీసర్లు సైతం సహకరిస్తున్నారని తెలుస్తోంది.