
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించే కంపెనీగా సింగరేణి అవార్డు అందుకొంది. బుధవారం హైదరాబాద్ లో జరిగిన 159వ ఇన్ కమ్ ట్యాక్స్ దినోత్సవంలో సింగరేణి తరపున డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్. బలరాం అవార్డు అందుకున్నారు. కొన్నేళ్లుగా అత్యధిక ఆదాయపన్ను చెల్లింపుదారుల్లో సింగరేణి సంస్థ టాప్ లో ఉంటోంది. 2018-–19 ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.25,828 కోట్ల టర్నోవర్ సాధించి రూ.750 కోట్ల ఆదాయ పన్ను చెల్లించింది. ఇంత పెద్దమొత్తంలో ఇన్ కం ట్యాక్స్ చెల్లించిన కంపెనీల్లో ఒకటిగా సింగరేణిని గుర్తిస్తూ ఇన్ కం ట్యాక్స్ ఉన్నతాధికారులు అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎన్.బలరాం మాట్లాడుతూ.. సింగరేణి టర్నోవర్ రూ.11,928 కోట్ల నుంచి 116 శాతం వృద్ధితో రూ.25,828 కోట్లకు చేరిందని, లాభాలు రూ.419 కోట్ల నుంచి 282 శాతం వృద్ధితో రూ.1600 కోట్లకు పెరిగినట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గత ఐదేళ్ల కాలంలో రూ.25,687 కోట్లను వివిధ రకాల ట్యాక్సుల రూపంలో చెల్లించినట్లు వెల్లడించారు.
తెలంగాణ, ఏపీ సర్కిల్ కు ఐదో స్థానం
దేశంలో అత్యధిక ఆదాయ పన్ను వసూలులో ఏపీ, తెలంగాణ సర్కిల్ ఐదో స్థానంలో నిలిచిందని ఏపీ, తెలంగాణ ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ శంకరన్ చెప్పారు. 2018-–19 లో రూ. 58,400 కోట్లు ట్యాక్స్ వసూలైందన్నారు. కార్పొరేట్ విభాగంలో అత్యధిక పన్ను చెల్లింపుదారులుగా తొలి మూడు స్థానాల్లో ఎన్‌ఎండీసీ (నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), ఆంధ్రా బ్యాంక్, సింగరేణి నిలిచాయన్నారు.