సింగరేణి లాభాల వాటా ఏటా లేటే.. ఎప్పుడిస్తదోనని కార్మికుల ఎదురుచూపు..!

సింగరేణి లాభాల వాటా ఏటా లేటే.. ఎప్పుడిస్తదోనని కార్మికుల ఎదురుచూపు..!

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి తన లాభాలను వెల్లడించడంలో ఎప్పుడూ లేటే చేస్తోంది. ఏటా ఆర్థిక సంవత్సరం ముగియగానే లాభాలను యాజమాన్యం ప్రకటించాల్సి ఉంటుంది. కానీ.. ఏటేటా లేట్ చేస్తుండగా.. గతేడాది కంపెనీ వాస్తవ లాభాలను ఇంకా ప్రకటించలేదు. దీంతో కార్మికులు అసహనంతో ఉన్నారు. 2024- –-25 ఆర్థిక సంవత్సరం ముగిసి 4 నెలలు గడుస్తోంది.  సంస్థ గతేడాది 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్‎గా పెట్టుకుని, 69.01 మిలియన్ టన్నుల సాధించింది. 

2023 – 24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,412 కోట్లు లాభాలు సాధించగా, కార్మికవాటాగా 33శాతం పంపిణీ చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో అంతకంటే ఎక్కువగానే లాభాలు వస్తాయని కార్మికులు అంచనా వేశారు. బొగ్గుకు డిమాండ్​అధికంగా ఉండడంతో పాటు వినియోగదారులకు రవాణా ఎక్కువగానే చేసింది. దీంతో ఆదాయం కూడా ఎక్కువగా వస్తుందనే భావించారు.  

లాభాల్లో వాటా ఇలా.. 

సింగరేణి యాజమాన్యం ముందుగా కంపెనీ ఆర్జించిన వాస్తవ లాభాలను వెల్లడిస్తుంది.  51శాతం వాటా కలిగిన రాష్ట్ర సర్కార్ ద్వారా​లాభాల్లో వాటా శాతం ప్రకటిస్తుంది. ఇది 2022-– 23లో 32 శాతంగా ఉంటే.. 2023-– 24 లో 33 శాతం వాటాగా ఉంది. కాంగ్రెస్ సర్కార్ రూ.795 కోట్లను కార్మికులకు పంపిణి చేసింది. ఈసారి అంతకంటే ఎక్కువగా లాభాలు వచ్చే చాన్స్ ఉండడంతో వాటా పెంచితే కార్మికులు ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది.                                                                                                                                

ఏటా ఆలస్యమే.. 

ఏ పరిశ్రమైనా ఆర్థిక సంవత్సరం ముగిసిన లాభాలను ప్రకటిస్తుంది. సింగరేణి మాత్రం ఏటా ఆలస్యం చేస్తోంది. రెండు నుంచి మూడు నెలల సమయం తీసుకుంటుంది. కోలిండియా కూడా మూడు నెలలకు ఒకసారి ఆర్థిక లావాదేవీలపై ప్రకటన చేస్తోంది. సింగరేణి సైతం ఏటా ఇదే విధానం పాటిస్తోంది. తొలి మూడు, ఆరు, తొమ్మిది నెలల్లో సాధించిన లాభాలను ప్రకటిస్తుండగా.. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఏడాది కంపెనీ సాధించిన లాభాల ప్రకటనపై లేట్ చేస్తోంది.

35 శాతం వాటా ఇవ్వాలని..

సింగరేణి వాస్తవ లాభాలు ప్రకటిస్తే, కార్మికులకు చెల్లించే వాటాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 2024 -– -25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల్లో 35శాతానికి తగ్గకుండా ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు వాటా పెంపుపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. యాజమాన్యం లాభాలు ప్రకటించిన వెంటనే మెరుగైన వాటా సాధించేందుకు ఇతర సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.