కోల్ మైన్స్ వద్ద ఎన్నికల ప్రచారంపై నిషేధం

కోల్ మైన్స్ వద్ద  ఎన్నికల ప్రచారంపై నిషేధం
  •     అన్ని జీఎంల ఏరియాలకు సింగరేణి యాజమాన్యం ఆదేశం
  •     ప్రచారంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని కామెంట్
  •     కోల్​ బెల్ట్​లో బీఆర్ఎస్​కు వ్యతిరేకత వల్లే మైన్స్ వద్ద ప్రచారాన్ని నిషేధించారంటున్న యూనియన్లు 

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : బొగ్గు గనుల వద్ద ఎన్నికల ప్రచారాన్ని నిషేధిస్తూ సింగరేణి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్​ జిల్లాల్లో విస్తరించిన సింగరేణి మైన్స్, డిపార్ట్​మెంట్లలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిషేధిస్తూ యాజమాన్యం రెండు, మూడు రోజుల కింద  అన్ని జీఎం ఏరియాలకు ఉత్తర్వులను పాస్  చేసింది. ఎన్నికల ప్రచారం వల్ల పారిశ్రామిక అశాంతితో పాటు బొగ్గు ఉత్పాదనకూ ఆటంకం కలిగే అవకాశం ఉందని ఆ ఉత్తర్వుల్లో యాజమాన్యం పేర్కొంది. కొత్తగూడెం, సత్తుపల్లి, పినపాక, ఇల్లెందు, మంచిర్యాల, మంథని, బెల్లంపల్లి, హుస్నాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, చెన్నూరు, రామగుండం

పెద్దపల్లి నియోజకవర్గాల పరిధిలో ఉన్న సింగరేణివ్యాప్తంగా అన్ని అండర్​గ్రౌండ్, ఓపెన్​కాస్ట్​ మైన్స్​తో పాటు డిపార్ట్​మెంట్ల వద్ద నోటీసులు వేశారు. సాధారణంగా కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు మార్నింగ్, సెకండ్​ షిఫ్ట్​లో మైన్స్​వద్ద గేట్  మీటింగ్ లు నిర్వహిస్తుంటారు. ఈసారి గేట్​ మీటింగ్​లు నిర్వహించడానికి వీల్లేదని యాజమాన్యం పేర్కొనడం కార్మికుల్లో చర్చనీయాంశమైంది. గేట్​ మీటింగ్​లతో సంబంధం లేకుండా ఆయా పార్టీలకు అనుబంధంగా ఉన్న యూనియన్లు తమ పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థులు, కార్మికులతో మాట్లాడిస్తూ ఓట్లు అడిగేలా ప్లాన్​ చేస్తున్నాయి. నామినేషన్ల పర్వం ప్రారంభమైందంటే మైన్స్​పై అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తుంటారు.

దీంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగడంతో పాటు రాజకీయ విభేదాలకు నెలవుగా మైన్స్​ మారే అవకాశం ఉందని భావిస్తూ యాజమాన్యం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. అయితే, కోల్​ బెల్ట్​లో అధికార బీఆర్ఎస్ పై​వ్యతిరేకత పెరగడం వల్లే బొగ్గు బావుల వద్ద ఎన్నికల ప్రచారాన్ని యాజమాన్యం నిషేధించిందని పలు యూనియన్ల లీడర్లు ఆరోపిస్తున్నారు. మార్నింగ్​, సెకండ్​ షిఫ్ట్​ల స్టార్టింగ్​ సమయాల్లో కనీసం గంట టైం ప్రచారానికి ఇవ్వాలని యూనియన్ల లీడర్లు కోరుతున్నారు.